తనను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణును నటి హేమ కలిశారు. ‘మా’ నుంచి తొలగించడం అన్యాయమని, తిరిగి సభ్యత్వం కల్పించాలని బహిరంగ లేఖ రాశారు. తాజాగా ఆ లేఖను మంచు విష్ణుకు అందజేశారు. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడంతో అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేసినట్లు ‘మా’ ప్రకటించిన విషయం తెలిసిందే.
‘మీడియా నాపై అనేక నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్లో నేను పరీక్షలు చేయించుకున్నా. వాటిలో నేను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టమైంది. త్వరలోనే పోలీసులు చేసిన పరీక్షల్లోనూ ఇవే రిజల్ట్స్ వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఈలోపే నన్ను దోషిగా భావించి ‘మా’ సభ్యత్వం రద్దు చేయడం సరైంది కాదని భావిస్తున్నా. గత కొన్ని రోజులుగా నాపై జరుగుతోన్న ప్రచారం వల్ల నేను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా. ఈ పరిస్థితుల్లో నాకు ‘మా’ అండగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ విషయాన్ని గమనించి నాపై సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశిస్తున్నా’ అని ఆ లేఖలో హేమ పేర్కొన్నారు.