ఏ సినిమాకు అయినా కథే ముఖ్యం. అది బలంగా ఉందంటే చాలు.. పెద్ద పెద్ద సెట్లు వేసి తీయకపోయినా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. ఈ విషయాన్ని ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక కేవలం కథను బేస్ చేసుకుని సినిమా తీయాలనుకున్నప్పుడు దాని లెన్త్ ఎక్కువగా ఉన్నా సరే.. కట్ చేయడానికి కుదరదు. కొన్ని సినిమాలను రెండు భాగాలుగా తీస్తుంటారు. మరి కొన్నింటిని లెన్త్ ఎక్కువైనా సరే ఒకే భాగంలో తీస్తారు.
ఇక కథే ముఖ్యంగా వచ్చిన బాహుబలి రెండు భాగాలుగా విడుదలై ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో అందరం చూశాం. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి మూడో సారి తీస్తున్న సినిమా పుష్ప. ఈ మూవీకి కథే బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. మామూలుగా సుకుమార్ సినిమా అంటేనే కథ బలంగా ఉంటుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన కథలు ఉంటాయి. ఇక పుష్ప కూడా ఇలాంటిదే. ఇక బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన పుష్ప టీచర్ ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాసింది.
ఇప్పుడు ఈ మూవీని కూడా రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప లెన్త్ మూడు గంటలకు పైగా ఉందని, అందుకే దీన్ని కూడా బాహుబలి లాగే రెండు భాగాలుగా తీస్తే అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయని సుకుమార్ టీం భావిస్తోందంట. ఇప్పటికే డైరెక్టర్ టీం కథను డెవలప్ చేసే పనిలో పడ్డారని సమాచారం. ఒక వేళ రెండో పార్ట్ ఉంటే.. అది మొదటి దానికన్నా థ్రిల్లింగ్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఏ మాత్రం బెడిసికొట్టినా.. ప్రమాదమే. చూడాలి మరి దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారో లేక సైలెంట్ గా ట్విస్ట్ ఇస్తారో. ఏదేమైన ఈ వార్త బన్నీ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేదే.