ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు… రేపు వెల్లడించనుంది.
ఈ సినిమా రాజకీయంగా తమను కించపరిచే విధంగా, తమ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా ఉందంటూ నారా లోకేశ్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుంది అనుకుంటే.. తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే వ్యూహం నిర్మాత న్యాయవాది విజ్ఞప్తిపై నారా లోకేశ్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమా విడుదలకు సంబంధించి తీర్పును హైకోర్టు శుక్రవారం వెలువరిచనుంది.