మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానులపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారని అశ్వనీ దత్ ప్రశ్నించారు. తాజాగా ఒక ఛానల్ తో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యాలు చేసారు.
ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం చిరంజీవికి ఆయనకు తెలియదా ? ప్రశ్నించిన ఆయన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లు సంపాదిస్తారని, ఆయన సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నారో చిరంజీవికి తెలియదా ? అని నిలదీశారు. హాస్యనటుడు పృథ్వీ వ్యాఖ్యలపై స్పందించిన అశ్వనీ దత్, పృథ్వీ హాస్యనటుడని, ఆయన మాటలకు విలువ ఇవ్వాల్సిన పని లేదన్నారు.
పృథ్వీ లాంటి వారి వల్లే జగన్ భ్రష్టు పట్టిపోతున్నారని, మద్దతు కోసం సినీ హీరోలను రైతులు అడ్డుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన, వాళ్ల సినిమాలు చూడటం మానేస్తే, వారే దిగివస్తారన్నారు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారన్న ఆయన, నటుడిగా కాకున్నా సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా ? అని ప్రశ్నించారు. జగన్ వాళ్ల నాన్న చేసిన దాంట్లో 10 శాంత చేసినా గొప్ప సీఎం అవుతారన్నారు.
మంత్రి బొత్స గురించి మాట్లాడిన ఆయన, బొత్స ఏం మాట్లాడుతున్నారో ఆయన కుటుంబసభ్యులకే అర్థంకావడం లేదని ఎద్దేవా చేసారు. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు భూములిస్తే ప్రతిగా రాజధానిలో భూములిచ్చారన్న ఆయన, ఇప్పుడు ఎయిర్ పోర్టు విస్తరించారని, ఆ భూములను ఎలా తిరిగిస్తారని నిలదీశారు. రాజధాని రైతులను చూస్తే ఆవేదన కలుగుతోందని ఆయన అన్నారు.