పెద్ద సినిమా.. చిన్న సినిమా.. ఒకప్పుడు ఈ లెక్కలేవు లేవు. అయితే భారీ ఫాలోయింగ్ తో స్టార్ క్రేజ్ తెచ్చుకుని కోట్ల బడ్జెట్ తో తీసే సినిమాలు పెద్ద సినిమాలు అవుతుండగా.. లో బడ్జెట్ లో కొత్త వాళ్లు చేసే ప్రయత్నాన్ని చిన్న సినిమాగా చెబుతున్నారు. ఈమధ్య ఓ సినిమా ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో పెద్ద, చిన్నా బేధం లేదు అన్నారు. కాని బడ్జెట్ తారతమ్యాలను బట్టి ఖచ్చితంగా వాటిని డిసైడ్ చేయాల్సిందే.
ఇక ఒకప్పుడు స్టార్ సినిమా అంటే ఎలా తీసినా ఆడేశాయి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది.. కంటెంట్ ఉన్న సినిమాకే ప్రేక్షకులు ఓటేస్తున్నారు. అది స్టార్ సినిమా అయినా కాకున్నా సరే కథాబలానికే మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏడాదిలో రిలీజ్ అయ్యే వందల కొద్ది సినిమాల్లో స్టార్ సినిమాలు ఆడితే సూపర్ హిట్ లేదంటే అర కొర లాసులతో నిరాశపరుస్తున్నాయి. కాని చిన్న సినిమాల పరిస్థితి అలా లేదు. స్టార్ సినిమాలు ఇయర్ మొత్తంలో ఓ 20 వస్తే మిగతా 80 చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి.
వాటికి సరైన పబ్లిసిటీ ఇచ్చి ప్రమోట్ చేస్తేనే హిట్ కొడతాయి. ఈమధ్య వచ్చిన ఆరెక్స్ 100 దీనికి పర్ఫెక్ట్ ఎక్సాంపుల్. సినిమాకు ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు కాబట్టే ఆరెక్స్ 100 ఈ రేంజ్ హిట్ అయ్యింది. ఆరెక్స్ 100లా ముద్దు ముచ్చట్లతో వచ్చిన సినిమాలకు మంచి గిరాకి ఉన్నా మిగతా చిన్న సినిమాలు మాత్రం ఆకట్టుకోవట్లేదు. ఆ సినిమాలు తీసిన నిర్మాతలు తీవ్ర నష్టాలపాలవుతున్నారు.
భారీ బడ్జెట్ తో వచ్చిన స్టార్ సినిమాలు ఆడుతున్నాయ్.. వెరైటీ ప్రమోషన్స్ తో వచ్చే చిన్న సినిమాలు ఆడుతున్నాయ్. కాని అటు ఇటు కాకుండా ఉన్న కొన్ని సినిమాలు మాత్రం నిరాశపరుస్తున్నాయి. శుక్రవారం దొరికిందా రిలీజ్ చేసేద్దాం అన్న లాజిక్ తప్ప సినిమాకు సరైన ప్రమోషన్.. అసలు రిలీజ్ అవుతున్న విషయం కూడా ప్రేక్షకులకు తెలియడం కూడా గగనంగా మారింది. తెలుగు పరిశ్రమలో ఈ ఒక్క పరిస్థితి మారితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు సిని విశ్లేషకులు.