ఆర్ఆర్ఆర్ 2 పై బిగ్ అప్డేట్.. కానీ..!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసిన సూపర్ హిట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు లభించడంతో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ మీద రాజమౌళి అలాగే ఆయన టీం ప్లానింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో భారీ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది.

ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా తెరపైకి రాబోతోంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి మహాభారతం సినిమాను చేస్తాడని.. అది కూడా ఏకంగా 10 భాగాలుగా ఉంటుందని రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ 2 కూడా ఉంటుంది అని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

అయితే ఈ సినిమా సీక్వెల్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ మళ్లీ కలిసి నటిస్తారట. కానీ రాజమౌళి ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం లేదని.. రాజమౌళి కాకపోతే హాలీవుడ్ డైరెక్టర్ తో ఈ సినిమాను దర్శకత్వం వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే మరి రాజమౌళి దర్శకత్వంలో కాకుండా సినిమా వస్తే వీరు నటించడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్న కూడా మొదలయ్యింది. ఇక రాజమౌళి పర్యవేక్షణలోనే సినిమా నడుస్తుందని డైరెక్టర్ మాత్రం వేరొకరు పనిచేస్తారు అని కానీ రాజమౌళి పైన ఉన్న నమ్మకంతోనే ఈ ఇద్దరు హీరోలు మళ్ళీ నటించే అవకాశం ఉందని సమాచారం.