కంటెస్టెంట్లకు చుక్కలు చూపించిన బిగ్ బాస్… బుంగమూతి పెట్టుకున్న మోనాల్..?

బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం ఎన్ని విమర్శలు మూటగట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న విషయాలకే కంటెస్టెంట్లు ఏడవడంతో బిగ్ బాస్ షో సీరియల్ ను తలపిస్తోందనే కామెంట్లు సైతం వ్యక్తమయ్యాయి. అయితే రెండో వారం నుంచి బిగ్ బాస్ ఇస్తున్న టాస్కుల వల్ల షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ సీజన్ లో సైలెంట్ గా ఉన్న బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో విశ్వరూపం చూపించాడు.

నియమ నిబంధనలు పాటించని కంటెస్టెంట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాడు. నిన్న బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ బీబీ టీవీలో భాగంగా కామెడీ షో జరిగింది. ఒక టీమ్ కు అమ్మ రాజశేఖర్, మరో టీమ్ కు ముక్కు అవినాష్ నేతృత్వం వహించగా రెండు టీములు తమ స్కిట్లతో వీక్షకులను అలరించాయి. ఒక్క ఓటుతో అవినాష్ టీమ్ విన్ అయినా బిగ్ బాస్ మాత్రం రెండు రీల్ జ్యూస్ బాటిల్స్ పంపించి రెండు గ్రూపులు గెలిచాయనే సంకేతం ఇచ్చాడు.

అనంతరం తెలుగు కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుతున్న అఖిల్‌, నోయ‌ల్‌, హారిక, మోనాల్, అభిజిత్ లపై బిగ్ బాస్ సీరియస్ కావడంతో పాటు బిగ్‌బాస్ మ‌మ్మ‌ల్ని క్ష‌మించండి అంటూ బోర్డుపై రాయలని ఆదేశించాడు. ఆ తర్వాత కొందరు ఇంటి సభ్యులు టాస్క్ లో పాల్గొనటానికి ఆలస్యంగా వస్తుండటంతో బెల్ కొట్టిన ప్ర‌తీసారి ఇంటిసభ్యులంతా ఒకే చోట చేరి 20 గుంజీలు తీయాలని… ఇంటి సభ్యులు నిబంధనలు ఉల్లంఘిస్తే లాస్య తన వస్తువు వదులుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు.

ఆ తర్వాత రెండో వారం కెప్టెన్ గా నోయల్ ఎంపికయ్యాడు. దేవి నాగవల్లి తనను అందరూ దూరం పెడుతున్నారని కామెంట్ చేయగా అలాంటిదేం లేదని లాస్య సర్దిచెప్పింది. అనంతరం దేవి నాగవల్లి, అమ్మ రాజశేఖర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. గొంతు పెంచి మాట్లాడితే తాను అంగీకరించనని దేవి అమ్మ రాజశేఖర్ తో చెప్పింది. అనంతరం మోనాల్ ను అవినాష్ అనుకరించడంతో మోనాల్ బుంగమూతి పెట్టుకుంది. అవినాష్ క్షమాపణలు కోరడంతో ఎపిసోడ్ ముగిసింది.