ఎవరికెలా ఉన్నా ఆమెకి మాత్రం బిగ్ బాస్ తో మేలే జరిగినట్టుంది..!

బిగ్ బాస్ రియాలిటీ షోకి వచ్చే వారు దాని ద్వారా వచ్చే పాపులారిటీతో పాటు భవిష్యత్తులో ఆ పాపులారిటీ సినిమా అవకాశాలకి ఉపయోగపడుతుందేమో అన్న దృష్టితోనే వస్తుంటారు. ఐతే బిగ్ బాస్ కి వచ్చే వారికి పాపులారిటీలో పెద్ద సమస్య ఉండదు కానీ, ఆ తర్వాత సినిమా అవకాశాలు వస్తాయా అన్నదే పెద్ద సమస్య. మొదటి సీజన్ నుండి చూసుకుంటే బిగ్ బాస్ విజేతగా నిలిచిన వాళ్ళెవరికీ అంతగా అవకాశాలు రాలేదు. మొదటి సీజన్ విజేత శివ బాలాజీ గానీ, రెండవ సీజన్లో కౌషల్ గానీ సినిమాల్లో ఏమంతగా కనిపించలేదు.

ఐతే రెండవ సీజన్లో కంటెస్టెంటుగా వచ్చిన నందినీ రాయ్ కి మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. గతంలో నందినీ రాయ్ ఎవరనేది చాలా మందికి తెలియదు. అటువంటిది ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి మాట్లాడుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆమె నటించిన చిన్న సైజు సినిమా మెట్రో కథలు ఆహాలో రిలీజైంది. అందులో నందినీ రాయ్ పాత్రకి మంచి పేరొచ్చింది. ఐతే తాజాగా మరో ఐదు వెబ్ సిరీస్ లలో నటిస్తుందని సమాచారం. అదలా ఉంటే శతమానం భవతి సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుందని టాక్.

ఈ ప్రాజెక్టు విషయమై అధికారికంగా సమాచారం రానప్పటికీ కన్ఫర్మ్ అయ్యిందనే అంటున్నారు. అదే జరిగితే నందినీ రాయ్ కి మంచి అవకాశం లభించినట్టే.