గత నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఒక్క ఎమ్మెల్యే సీటును గెలిచింది సీపీఐ. ఇప్పుడు అదే సీపీఐ ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకొని ప్రతిపాదనలు కూడా కాంగ్రెస్ కి పంపింది. తమకు కనీసం ఒక్క ఎంపీ స్థానాన్ని కేటాయించాలని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరుతున్నారు. ఈమేరకు తెలంగాణలో సీపీఐ బలంగా ఉన్న 5 ఎంపీ స్థానాలను సీఎం రేవంత్ వద్ద ప్రతిపాదించారాయన. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి ఎంపీ సీట్లలో ఏదో ఒక సీటు కేటాయించాలని కాంగ్రెస్‌కి విజ్ఞప్తి చేశారు. ప్రతిపాధించిన 5 ఎంపీ స్థానాల్లో ఒక్కటైన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఏదో ఒక ఎంపీ స్థానం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారాయన.
తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన స్థానాలతో పోలిస్తే ఈ ఐదు ఎంపీ సీట్ల పరిధిలో బలంగా ఉన్నామని సీపీఐ చెప్తోంది. కాంగ్రెస్ సహకరించి ఒక సీటు కేటాయిస్తే.. గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది సీపీఐ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకుని ఒక సీటు కేటాయించినట్టే.. ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికల్లోనూ ఒక సీటు కేటాయించాలని కోరుతోంది.ఒక్క సీటైనా ఇచ్చేలా ఒప్పిస్తామని అటు సీపీఐ నేతల వద్ద చెప్తున్నారు సాంబశివరావు. కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి అదనపు బలం ఉంటుందని చెప్తూ తమకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానమైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇండియా కూటమీలో ఉన్న సీపీఐ కి పలు రాష్ట్రాల్లో సీట్లను కేటాయించింది కాంగ్రెస్.ఇంకా కొన్ని స్థానాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి.తమిళనాడులో కూడా సీపీఐకి డీఎంకే రెండు సీట్లు కేటాయించింది.ఈ విషయాన్ని గుర్తు చేయడంతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ రోజురోజుకి తగ్గిపోతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్లేస్‌ను బీజేపీ భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తుందని దీనిని తిప్పికొట్టేందుకు సహకరించాలని కాంగ్రెస్ ని కూనంనేని కోరారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయంపై సీపీఐ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.