బెట్టింగ్ యాప్ ఉచ్చులో బాలీవుడ్.. నటి శ్రద్ధా కపూర్‌కు ఈడీ సమన్లు

-

బాలీవుడ్ ప్రముఖుల చుట్టూ బెట్టింగ్ యాప్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే రణ్​బీర్ కపూర్, కపిల్ శర్మ, హూమా ఖురేషి, హీనా ఖాన్ వంటి ప్రముఖలకు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఇక తాజాగా నటి శ్రద్ధా కపూర్​కు సమన్లు జారీ చేసి.. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈడీ కోరినట్లు తెలిసింది. అయితే ఈ రోజు శ్రద్ధా విచారణకు హాజరవుతారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇదే కేసులో ఈడీ సమన్లు అందుకున్న రణ్‌బీర్‌ కపూర్‌ కూడా శుక్రవారం రాయ్‌పుర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంది. కాగా, ఆయన రెండు వారాల సమయం కోరినట్లు సమాచారం. ఇక, కపిల్‌ శర్మ, హూమా ఖురేషి, హీనా ఖాన్‌ను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించనున్నట్లు తెలిసింది.

మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌ 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. ఈ యాప్‌ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సౌరభ్‌, రవి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

అయితే బాలీవుడ్ నటులంతా ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి.. అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి డబ్బు అందుకున్నారన్నది ఈడీ అభియోగం. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మిగతా వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news