తెలుగు హీరోయిన్ అంజలి తమిళం, తెలుగు సినిమాల్లో నటించింది. అయితే తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ అంజలికి కష్టాలు వీడేలా లేవు. ప్రస్తుతం అంజలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోవై సుడర్‌పార్వై మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. చట్ట నిబంధనలను పాటించకుండా తయారు చేస్తున్న ఒక వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారం చేస్తున్నారంటూ ఆమెపై ఫిర్యాదు చేశారు. వారు తయారు చేస్తున్న వంట నూనెను కొని పరిశోధనలకు పంపామని తెలిపారు.
ఆ పరిశోధనలో తయారీదారులు నిభంధనలను పాటించడం లేదని తెలిసిందన్నారు. ఆ వంటనూనెతో ప్రజలకు హానికరం అని తెలిసిందన్నారు. అయినా వంటనూనెను కోవై జిల్లాలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ఆ వంటనూనెను స్వాధీనం చేసుకుని.. దీనికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అంజలి.. ఒకరకంగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాబట్టి ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.