టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా హును-మాన్. తేజ సజ్జా కథానాయకుడిగా సముద్రఖని కీలకపాత్రలో నటించారు. తమిళ నటుడు వినయ్ రాయ్ ప్రతినాయక పాత్రలో మెరిశారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అంచనాలకు మించి ప్రేక్షకుల మనసు గెలిచింది.
థియేటర్ల సమస్యలు, చిన్న హీరో అంటూ ట్రోల్స్ ఇలా ఎన్నో అడ్డంకులు ఎదురైనా ప్రశాంత్ వర్మ సినిమా విడుదలను మాత్రం వాయిదా వేయలేదు. కంటెంట్ ఉంటే ఎంత బడా హీరోల సినిమాల ముందైనా తన సినిమా ఆడుతుందన్న వర్మ నమ్మకం నిజమైంది. ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కథ, బీజీఎం, ట్విస్టులు, విజువల్స్ ఇలా అన్ని విభాగాల్లో వండర్ సృష్టించిందని ప్రేక్షకులు అంటున్నారు. ఎంతైనా ప్రశాంత్ వర్మ మామూలోడు కాదయ్యా అంటూ డైరెక్టర్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ – ఈ సూపర్ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా అద్భుతంగా తీర్చిదిద్దాడని ఈ కుర్ర దర్శకుడిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఎంతైనా వర్మ సినిమా అంటేనే వర్తు బ్రదరూ వర్త్ అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.