ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలను మింగేస్తున్న కంటికి కనిపించని కరోనా వైరస్ పై యుద్ధం లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించి కఠిన చర్యలు చేపడుతున్నారు మన ప్రధాని తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు. ఈ నేపథ్యంలో తమ వంతు సాహాయం అందించడానికి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖలు ముందుకొచ్చి ప్రజలను ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు అభిమానుల నుండి, ప్రజల నుండి మనం తీసుకోవడమే కాదు.. కష్టం, నష్టం వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఎంతో ఉందంటూ అందరూ ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది తెలుగు హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక సాహాయాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ సినీ నటులు ‘కరోనా క్రైసెస్ ఛారిటీ’ని ఏర్పాటు చేసి తమ వంతు సాయం అందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు అటు తమిళ చిత్ర పరిశ్రమలో నటీనటులు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు తమ వంతు ఆర్ధిక సాహాయం చేస్తున్నారు. వీరిలో కొంతమంది కొంతమంది శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే నేపథ్యంలో మంచు ఫ్యామిలీ ముందుకు వచ్చి పేదలను ఆదుకోవడం ఆసక్తికరంగా మారింది.
మంచు మోహన్ బాబు – విష్ణు – లక్ష్మీ ప్రసన్న కలిసి కరోనా బాధితులను ఆదుకోవడంలో భాగంగా ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతంలోని ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకొని గ్రామస్థుల అవసరాలను తీరుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆ గ్రామాలలోని పేదవారికి ప్రతీ రోజు రెండు పూటలా భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విరమించే వరకు మంచు ఫ్యామిలీ ఈ సహాయాన్ని కొనసాగిస్తారట. ఇదే కాదు ప్రతిరోజూ ఎనిమిది టన్నుల కూరగాయలను ఆ గ్రామాలలో పంపిణీ చేస్తున్నారు. మంచు మనోజ్ కూడా కరోనా బాధితుల సహాయార్థం విరాళాలు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీ అంతా కలిసి చేస్తున్న ఈ మహత్తర కార్యక్రం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.