బిజినెస్ స్కూల్ కు పోయి పాఠాలు చెప్పే స్థాయి
ఓ సినీ దర్శకుడు పొందారంటే అది అతిశయం కాదు
ఆ ఘనత ఆ స్థాయి పొందిన దర్శకులు రాజమౌళి
సినిమా అంటేనే లాభ నష్టాల వ్యాపారం
ఇందులో ఇంటికి వచ్చేదెంత అందులో మిగిలేదెంత
వడ్డీలు ఎన్ని అప్పులు ఎన్ని
వీటిని దృష్టిలో ఉంచుకుని చేయాల్సిన పని
వ్యవహారం చెడితే డబ్బులు పోతాయి పరువు కూడా పోతుంది.
కరోనా కారణంగా రాజమౌళి ఈ సినిమా కారణంగా యాభై కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. నెలకు ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున వడ్డీలు చెల్లించారు నిర్మాత దానయ్య. ఆయనకు ధైర్యం చెబుతూనే సినిమా విడుదల ఆలస్యం అవుతున్న విషయమై ఎక్కడా ఆందోళన చెందకుండా, భయం, ఉద్వేగం, ఉత్పాతం లాంటివి వెల్లడి కానీయకుండా జాగ్రత్త పడ్డారు. ఏ నిమిషంలో నా సినిమా విడుదలయినా విజయం సాధిస్తుంది అన్న నమ్మకాన్ని నిర్మాతకే కాదు యావత్ ప్రపంచానికీ అందించారు రాజమౌళి.
నిజంగా ఇది ఫస్ట్ క్లాస్ ఎకనిక్ లా.. ఇంతకుమించిన వాణిజ్య సూత్రం ఏముంటుంది? నమ్మకానికి మించిన వాణిజ్య సూత్రం ఎవరు మాత్రం అందించగలరని? అంతకుమించిన భరోసా ఆశించగలరని?
ఇంకా చెప్పాలంటే..
ఏ విషయంలోనైనా, ఏ అంశంలోనైనా రాజమౌళిది భారీ విజన్. అందుకు తగ్గట్లుగానే ఆయన సినిమాలూ ఉంటాయి.ఆ భారీతనం అన్ని వేళలా అంచనాలను అందుకుంటుందా? బాహుబలి, దాని రికార్డ్స్‌ను చూసిన తర్వాత ఇదేం మాట అని అనుకోవచ్చు. కానీ బాహుబలి స్థాయిలోనే ఆ రకమైన అంచనాలతోనే విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ బ్రేక్ ఈవెన్ అందుకుంటుందా? ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను చేరుకోవాలంటే 600 కోట్ల వసూళ్లు సాధించాలి. ఆ తర్వాత ఎంత సాధించినా అది ఆనందాన్ని కలిగించే విషయమే..ఆ ధనం.. నిర్మాతకూ, దర్శకుడికీ అ‘ధనమే’. చిత్రనిర్మాతకు, ఇతర బృందానికి ఇప్పుడు ఈ సినిమా ముఖ్యంగా సాధించాల్సిన ప్రయోజనమిది.
ముఖ్యంగా ఈ సినిమాలో ఓ విధంగా రాజమౌళి నిర్మాణ భాగస్వామి కూడా ! పైకి వెల్లడి చేయకపోయినా పారితోషకం కాకుండా సినిమా లాభాల్లో ఎంతో కొంత వాటా ఆయన తీసుకోవడం బాహుబలి నుంచి వస్తున్న ఆనవాయితీ లేదా అమలు చేస్తున్న సూత్రం. ఇది కూడా ఓ ఆర్థిక పాఠమే ! భారీ చిత్రాలకు దర్శకుడిగా ఉండడమే పెద్ద పని అయినప్పటికీ, నిర్మాణ రంగంలో కుటుంబం అంతా పనిచేస్తుంది కనుక సంబంధించి ఆర్థిక వనరులు అన్నీ కలిసివచ్చేవే ! కీరవాణి కూడా బాహుబలి విషయమై చాలా లాభ పడ్డారు. కానీ ఈ సినిమా సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు అన్నది ఓ వాస్తవం.
అయినా కూడా కాస్తో కూస్తో ఇది కూడా ఆయనకు లాభం ఇచ్చే సినిమానే కానుండడం విశేషం. ఓ విధంగా వల్లీ, రమ, కార్తికేయ (బాహుబలి సెకండ్ యూనిట్ డైరెక్టర్,ఈ సినిమాకు క్రియెటివ్ హెడ్ ) వీళ్లంతా సినీ నిర్మాణంలో పాల్గొని ఓ విధంగా రాజమౌళి కి ఆర్థికంగానూ, నైతికంగానూ మద్దతు ఇస్తున్నారు. ఆ విధంగా ఓ కుటుంబం మొత్తం ఓ సినిమాకు పనిచేయడం ప్రపంచ చరిత్రలో లేదు.ఇది కూడా ఓ వాణిజ్య సూత్రమే ! ఇక ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా బాహుబలి తో పోలిస్తే ట్రిపుల్ ఆర్ కు ఎక్కువ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఇవెంట్లు రెండు సార్లు చేయాల్సి వచ్చింది.ఆ విధంగా ఈ సారి ఆర్థిక సూత్రాలు (కరోనా కారణంగా) లెక్క తప్పినా కొన్ని ఏరియాల్లో రాజమౌళి టీం వెళ్లడంతోనే సినిమాకు అప్పటిదాకా ఉన్న హైప్ ఇంకాస్త పెరిగింది అన్నది నిజం.
అదేవిధంగా రాజమౌళి ఎక్కడికి వెళ్లినా లోకల్ టాలెంట్స్ ను భలే గా ప్రశంసిస్తారు.ఇది కూడా ఓ వాణిజ్య సూత్రం కావొచ్చు.
ఎందుకంటే సినిమాతో అక్కడి జనం కనెక్టివిటీని పెంచుకునేందుకు అవకాశాలు పెరుగుతాయి. లోకల్ ఆర్టిస్టులు కొందరిని పదే పదే ప్రస్తావించి మాట్లాడడం కూడా ఓ విధంగా వాణిజ్య సూత్రమే! ఇది కూడా బాహుబలికి మరియు ట్రిపుల్ ఆర్ కు బాగా ప్లస్ అయిన విషయమే కావడం విశేషం.ఇలా చెప్పుకుంటూ వెళ్లే ట్రిపుల్ ఆర్ అనే కాదు బాహుబలి అనే కాదు ఇంతకుముందు తీసిన మర్యాద రామన్న, ఈగ లాంటి సినిమాలు కూడా బడ్జెట్ అవధులు దాటని సినిమాలు..ఆ విధంగా ఎన్నో వాణిజ్య సూత్రాలు వల్లె వేసిన చిత్రాలు కూడా ! ఏదేమయినప్పటికీ సినిమా చిన్నదా, పెద్దదా అన్నది కాదు ఆడియెన్స్ ను అలరించిందిందా లేదా అన్నదే ముఖ్యం కనుక బడ్జెట్ అవధులు దాటని చిన్న సినిమాలతో రాజమౌళి మంచి పేరు ఎలా తెచ్చుకున్నారో అదేవిధంగా బడ్జెట్ అన్నది బౌండరీలు దాటినా కూడా భయం చెందకుండా బాహుబలి, ట్రిపుల్ ఆర్ రూపొందించి అనూహ్యం అనుకునే విజయాలు అందుకున్నారు రాజమౌళి. ఆ విధంగా ఆయన వ్యూహమే ఓ వాణిజ్య సూత్రానికి పక్కా కొలమానం.
– మన లోకం ప్రత్యేకం