మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘దిల్ తో హ్యాపీ హై జీ’లో సిమ్మీ ఖోస్లాగా గుర్తింపు పొందిన శర్మ.. శుక్రవారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తన జీవితంలో గతంలో చోటు చేసుకున్న ఘటనలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న సెజల్ శర్మ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు మనకు తెలిసిన విషయమే. అసల ఈ కథలో ట్విస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈమె మరణ వార్త విని విషాదంలో మునిగిపోయిన అభిమానులు.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. అయితే ఇలా సోషల్ మీడియాలో ఆమెకు నివాళులర్పిస్తున్న వారికి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ రావడంతో ముందు షాక్ అయ్యారు.
ఆ తర్వాత ఆగ్రహంతో రగిలిపోయారు. ఎందుకంటే ‘నేను చావలేదు’ అంటూ స్వయానా సెజల్ శర్మే ఈ పోస్టు చేసింది. దీంతో ఆశ్చర్యపోయిన అభిమానులకు ఆమె వివరణ ఇచ్చింది. సెజల్ శర్మ అనే మరో నటి మరణించిందని, తను క్షేమంగానే ఉన్నానని ఆమె పేర్కొంది. ‘ఈ మీడియా వాళ్లను చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది. నిజం తెలుసుకోకుండా నా ఫొటోతో ఈ వార్తను ఎలా ప్రసారం చేస్తారు. దీని వల్ల మా బంధువులంతా చాలా బాధపడ్డారు’ అని తెలిపింది. దీంతో ఆమె అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. సదరు మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.