ఆర్ఆర్ర్ ఇచ్చిన సక్సెస్ కిక్ లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఏకంగా మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు తెలుగుతో పాటు హిందీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దాదాపుగా మూడేళ్ల తరువాత ఎన్టీఆర్ సినిమా రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే మరో క్రేజీ కాంబినేషన్ లో మన ముందుకు రాబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించారు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపాడు. ఇటు ట్రిపుల్ ఆర్ రిలీజ్ కావడంతో పాటు మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ‘ ఆచార్య’ సినిమా కూడా విడుదలకు సిద్ధం అయింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ ఫిక్స్ అయింది. అయితే మిగతా కాస్ట్ అండ్ క్రూను వెల్లడించాల్సి ఉంది. 2016లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి.