ప్రముఖ నటుడు రాజకీయ వేత్త అంబరీష్ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అంబరీష్ బెంగళూరు హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నారు. కిడ్నీ, శ్వాసకోశ సంబందిత వ్యాధితో బాధపడుతున్న అంబరీష్ శనివారం రాత్రి గుండెపోటుతో మరణించడం జరిగింది.
మైసూర్ రాష్ట్రం మాండ్యలోని దొడ్డరసినకెరెలో 1952 మే 29న అంబరీష్ జన్మించారు. హుచ్చే గౌడా, పద్మావతిరావు దంపతులకు ఆయన జన్మించారు. అంబరీష్ అసలు పేరు హుచ్చే గౌడా అమర్ నాథ్. అయితే అభిమానులంతా ఆయన్ను అంబీ అని పిలిచే వారు. 1972లో అంబరీష్ నాగరాహవు సినిమాతో తెరంగేట్రం చేశారు.
కన్నడలో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అంబరీష్ దాదాపు 200 పైగా సినిమాల్లో నటించారు. 1991లో ఆయన ప్రముఖ సిని నటి సుమలతను పెళ్లి చేసుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా అంబరీష్ తనదైన ముద్ర వేసుకున్నారు. 2013లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన అంబరీష్ ఆ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రిగా పనిచేశారు.
అంబరీష్ మృతి పట్ల కన్నడ సిని పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన్ మరణ వార్త తెలుసుకున్న తెలుగు, తమిళ సిని ప్రముఖులు తమ నివాళి అర్పించడం జరిగింది. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, దునియా విజయ్ లు అంబరీష్ మృతి చెందిన హాస్పిటల్ కు చేరుకున్నారు.