’మా‘ ఎన్నికకు భద్రత కల్పించండి – ఎన్నికల అధికారి

రాజకీయాలను తలపిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ’మా‘ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 10 వ తేదీని ఎన్నికలు జరుగనున్నాయి. తర్వాతి రోజు అంటే 11 న కౌంటింగ్ చేపట్టనున్నట్లు ఇప్పటికే మా ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో భద్రత కల్పించాలంటూ మా ఎన్నికల అధికారి క్రిష్టమోహన్ పోలీసులకు లేఖ రాశారు. ఎన్నికల ప్రశాంతంగా జరగడానికి, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు భద్రత కల్పించాలని లేఖలో కోరారు.

 దాదాపు 200 మందితో పోలీసుల భద్రత ఏర్పాటు చేయనున్నారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్ల మధ్య పోటీ నెలకొంది. ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో గత వారం రోజులుగా రెండు ప్యానెళ్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శల నుంచి పోలీస్ స్టేషన్లలో కేసుల దాకా వెళ్లింది. కోటా శ్రీనివాస్ రావు వంటి సీనియర్ ఆర్టిస్టులు మంచు విష్ణుకు మద్దతు పలకగా, నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మా ఎన్నిక నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.