ఏపీలో విద్యుత్‌ సంక్షోభం : తెలంగాణను మెచ్చుకున్న టీడీపీ !

ఏపీలో విద్యుత్‌ సంక్షోభంపై పయ్యావుల కేశవ్ సీరియస్‌ అయ్యారు. ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని… విద్యుత్ విషయంలో విభజన నాటికి ఏపీ మిగుల్లో ఉంటే.. తెలంగాణ లోటులో ఉందని…గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు విద్యుత్ విషయంలో సీన్ రివర్స్ అయిందని… ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసినట్టే.. విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారని వైసీపీపై మండిపడ్డారు.

చైనాతో పోలికలు దేనికి.. పక్కనున్న తెలంగాణ పరిస్థితేంటీ..? 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తోన్నా.. తెలంగాణలో విద్యుత్ మిగులు ఉందనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ విషయం లో తెలంగాణ బాగా పనిచేస్తుందన్నారు. సీఎం జగన్ కు అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని… సీఎం నోటి వెంట అర్ధ సత్యాలు.. అవాస్తవాలు పలికిస్తోంది అధికారులేనని ఫైర్‌ అయ్యారు. సింగరేణికి బిల్లులు చెల్లించకుండా జాప్యం చేసింది మీరు కాదా..? ఆర్టీపీపీ.. వీటీపీఎస్ ప్లాంటును మూత వేయించి.. ప్రైవేట్ వాళ్లకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందూజా, కృష్ణపట్నం షట్ డౌన్ అయ్యేలా చేసింది జగన్‌ ప్రభుత్వమేనని నిప్పులు చెరిగారు. ఏపీలోని పవర్ ప్లాంట్స్ నుంచి విద్యుత్ కొనుగోళ్లను ఆపేసి.. బయట నుంచి కొనుగోళ్లు చేశారని.. బయట ఎక్సైంఛులలో కొనుగోళ్లు చేయాల్సి వచ్చింది కాబట్టే ఎక్కువ ధరకు కొనగోలు చేయాల్సి వచ్చిందన్నారు. అదానీ నుంచి కొనుగోళ్లు చేయడం ద్వారా రూ.50 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తారా..? డిస్కంలకి నష్టాలు రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు.