ఒక్క చీర నేయాలంటే కనీసం 9000 సార్లు ఆసు వేయాలి. దాని కోసం 9000 సార్లు చేతిని తిప్పాల్సిందే. ఒక్క చీర కోసం 9000 సార్లు చేయిని తిప్పాలంటే చేతికి ఉన్న ఎముకలు ఉంటాయా? తన తల్లి పడుతున్న ఆ బాధ తట్టుకోలేకనే మల్లేశం.. ఆసు యంత్రాన్ని తయారు చేసే పనిలో పడతాడు.
తారాగణం: ప్రియదర్శి, ఝాన్సీ, చక్రపాణి, అనన్య, లక్ష్మణ్ ఏలె, గంగవ్వ, తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం: మార్క్ కె రాబిన్
సాహిత్యం: దాశరథి, గోరేటి వెంకన్న, చంద్రబోస్
సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్య
సంభాషణలు: అశోక్ కుమార్ పెద్దింటి
నిర్మాతలు: రాజ్ ఆర్, శ్రీ అధికారి
దర్శకత్వం: రాజ్ ఆర్
మల్లేశం.. ఇదేదో రాసుకొని తీసిన సినిమా కాదు. ఓ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించిన సినిమా. మనం సినిమా ఇండస్ట్రీలో ఎందరివో బయోపిక్స్ చూశాం. నిజంగా జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలను చూశాం. కానీ.. ఈ సినిమాను వాటితో పోల్చలేం. పోల్చకూడదు కూడా. ఎందుకంటే.. మనం చూసిన బయోపిక్స్ అన్నీ పెద్ద పెద్ద సెలబ్రిటీలవి. వాళ్ల గురించి దేశమంతా తెలుసు. కానీ.. చింతకింది మల్లేశం అనే వ్యక్తి గురించి ఎంతమందికి తెలుసు.
తెలంగాణలోనే చింతకింది మల్లేశం గురించి తెలియని వాళ్లు కోకొల్లలు. చేనేత వృత్తి గురించి అవగాహన ఉన్నవాళ్లకు ఆయన సుపరిచితులు కావచ్చు కానీ.. మిగితా వాళ్లకు ఆయన గురించి తెలియదు. ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని.. ఆయన ఆసు యంత్రాన్ని కనుగొన్నారని ఎంతమందికి తెలుసు. అసలు.. ఆసు యంత్రం అంటేనే చాలామందికి తెలియదు.
అందుకే.. చేనేత వృత్తికే గర్వకారణం అయినా చింతకింది మల్లేశం జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించి సఫలం అయ్యారు దర్శకుడు. అందుకే దీన్ని బయోపిక్ అనలేం.. ఇంకా వేరే ఏ పేరుతో కూడా పిలవలేం.
సాధారణంగా తెలుగు సినిమా ధోరణి ఎలా ఉంటుందో మీకు తెలుసు. మూడు ఫైట్లు, ఆరు పాటలు, కొంత కామెడీ, మరికొంత ట్రాజెడీ, ఇంకొంత సెంటిమెంట్.. ఆ తర్వాత క్లయిమాక్స్. మల్లేశం సినిమా మాత్రం అటువంటి మూస ధోరణి నుంచి వచ్చిన సినిమా అస్సలు కాదు. అందుకే అదే మూస ధోరణి కోరుకునే వాళ్లు ఈ సినిమాకు వెళ్లకపోవడమే మంచిది.
అసలు ఆసు యంత్రం అంటే ఏంటి.. చేనేత వృత్తిలో ఎన్ని సమస్యలు ఉంటాయి. నేతన్న ఒక చీర నేయాలంటే ఎంత కష్టపడతాడు. ఎన్ని సార్లు ఆసు కోసం చేతిని తిప్పాలి. చేనేత వృత్తిలో ఎదుర్కునే సవాళ్లు ఏంటి? అసలు.. నేతన్నల బాధలు ఏంటి.. మల్లేశం ఆసు యంత్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ఆసు యంత్రం ద్వారా నేతన్న పని ఎలా సులువు అవుతోంది. మల్లేశం జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఆయన ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆసు యంత్రాన్ని కనిపెట్టేటప్పుడు ఆయనకు ఎదురైన సమస్యలు ఏంటి? ఆయనకు పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చారు.. అనే విషయాలు మీకు తెలుసుకోవాలని ఉంటే.. అప్పుడు మాత్రమే ఈ సినిమాకు వెళ్లండి.
ఈ సినిమాలో బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ అస్సలు ఉండవు. చాలా సహజంగా సినిమా ఉంటుంది. సహజత్వానికి మారుపేరు ఈ సినిమా. మారుమూల పల్లెలో పుట్టిన చింతకింది మల్లేశం కుటుంబం వృత్తి చేనేత పని. కానీ.. వాళ్లు చేసే పనికి తగ్గ ఫలితం దక్కకపోవడంతో వాళ్లు పడే కష్టాలు. మూడు పూటల తిండి తినాలంటే రాత్రింబవళ్లు నేత పని చేయాల్సిందే.
కానీ.. ఒక్క చీర నేయాలంటే కనీసం 9000 సార్లు ఆసు వేయాలి. దాని కోసం 9000 సార్లు చేతిని తిప్పాల్సిందే. ఒక్క చీర కోసం 9000 సార్లు చేయిని తిప్పాలంటే చేతికి ఉన్న ఎముకలు ఉంటాయా? తన తల్లి పడుతున్న ఆ బాధ తట్టుకోలేకనే మల్లేశం.. ఆసు యంత్రాన్ని తయారు చేసే పనిలో పడతాడు. కానీ.. ఆసుయంత్రం తయారు చేసే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు మల్లేశం. చాలా సమస్యలు.. అప్పు చేస్తాడు. ఓ సారి యంత్రం కాలిపోవడం.. ఇలా ఎన్నో సమస్యల నడుమ.. వాటన్నింటినీ ఎదుర్కొని చివరకు ఆసు యంత్రం రూపొందించి శెభాష్ అనిపించుకుంటాడు. మధ్యలో ఓసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలి అని అనుకుంటాడు మల్లేశం. అన్ని సమస్యల నడుమ ఎన్నో ఛీత్కారాల నడమ.. మల్లేశం చివరకు ఎలా ఆసుయంత్రం రూపొందించాడు.. అనేదే ఈ సినిమా.
ఈసినిమాలో చేసిన ఏ క్యారెక్టర్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాత్రల కోసమే వాళ్లు పుట్టారా? అన్నట్టుగా చేశారు. ఆ క్యారెక్టర్లను ఎంచుకున్న డైరెక్టర్ కు హ్యాట్సాఫ్. ఎవరి పాత్రకు వాళ్లు తగిన న్యాయం చేశారు.
సినిమాల్లో సహజత్వాన్ని కోరుకునేవారు… నిజాయితీని కోరుకునే వారు.. స్ఫూర్తిని కోరుకునే వారు… హంగూఆర్భాటాలను కోరుకోని వారు.. మూస ధోరణిని కోరుకోని వారు మాత్రమే ఈ సినిమాకు వెళ్లండి.
చివరగా ఓ మాట.. జన్మనిచ్చే తల్లి పేగుబంధం కోసం.. బతుకునేర్పే పోగు బంధం కోసం పరితపించే ఓ వ్యక్తి జీవితమే ఈ సినిమా.