కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మురుగదాస్ కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన సర్కార్ సినిమాలో అధికార పార్టీని కించ పరిచేలా కొన్ని సీన్స్ ఉన్నాయని.. వాటిని తొలగించాలని అన్నాడిఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో చిత్ర దర్శక నిర్మాతల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. మొన్న అర్ధరాత్రి టైంలో మురుగదాస్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అతని ఇంటికి కూడా వెళ్లారట.
అయితే ఇదంతా ముందే ఊహించిన మురుగదాస్ ముందస్తు బెయిల్ ఆర్డర్ తెచ్చుకున్నాడట. అంతేకాదు సినిమాలో అధికార పార్టీని కించపరచేలా ఎలాంటి సీన్స్ లేవని ఆయన బెయిల్ పిటీషన్ లో రాశారట. మురుగదాస్ ముందస్తు బెయిల్ పిటీషన్ వేయడంతో అతన్ని నవంబర్ 27వరకు అరెస్ట్ చేయకూడదని కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈలోగా ఈ వివాదం సర్ధుమణుగుతుందని అంటున్నారు.
విజయ్ హీరోగా నటించిన సర్కార్ సినిమా ఓ పక్క వసూళ్ల బీభత్సం సృష్టిస్తున్నా.. మరోపక్క సినిమాపై గొడవలు ఎక్కువవుతునాయి. ముఖ్యంగా సినిమాలో మిక్సీలు, టివిలు తగలబెట్టడం, వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర పేరు కోమలవల్లి జయలలిత అసలు పేరని.. ఆమె పేరు వాడినందుకు గాను పెద్ద గొడవే చేస్తున్నారు. అయితే ఎలాగోలా ఈ వివాదం నుండి సినిమాను బయట పడేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అభ్యంతరకరమైన సీన్స్ తొలగించారని సమాచారం.