Karuna Kumar: తెలుగు దర్శకుడికి దక్కిన గౌరవం..పీకే రోజ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ‘పలాస 1978’..

-

తెలుగు సినిమా దర్శకుడు కరుణ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పలాస 1978’ చిత్రం పీకే రోజ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలందాయి.

సామాజిక బాధ్యతతో దర్శకులు చేసే సినిమాలను ‘పీకే రోజ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శిస్తుంటారు. వెండితెరపైన సామాజిక అంశాలను ప్రస్తావించే దర్శకులుగా పా రంజిత్, నీరజ్ ఘావన్, వెట్రిమారన్ తదితరులుండగా, ఆ జాబితాలోకి తెలుగువాడైన కరుణ కుమార్ చేరిపోయాడు.

పలాస 1978 మూవీ రిలీజ్ అయి త్రీ ఇయర్స్ అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ సినిమా గురించి డిస్కషన్ జరుగుతుంటుంది. దళితులకు రాజకీయ అధికారం రావాలనే అంశం ఇతివృత్తం ఈ చిత్రంలో ఉండటం వలనే ఆ సినిమాను ‘పీకే రోజ్ ఫిల్మ్ ఫెస్టివల్’కు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఈ నెల 9,10,11 తేదీలలో ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఆ ఫెస్టివల్ లో ‘పలాస 1978’ ఫిల్మ్ ప్రదర్శితం కానుంది.

ఈ నెల 14న మహనీయుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంతకు ముందే నిర్వహించే పీకే రోజ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తన చిత్రం ప్రదర్శితం కాబోతుండటం పట్ల దర్శకుడు కరుణ కుమార్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫెస్టివల్ లో తన సినిమా ప్రదర్శితం కాబోతుండటం తనకు గర్వంగా ఉందని తెలిపారు.

చక్కటి ప్రయత్నానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ తోడుగా ఉంటారని ఈ సందర్భంగా కరుణ కుమార్ పేర్కొన్నారు. కరుణ కుమార్ ‘పలాస 1978’ సినిమా తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫిల్మ్ చేశారు. ఇందులో హీరోగా సుధీర్ బాబు నటించారు. అయితే, ఈ మూవీ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news