చిత్రం : పలాస 1978
నటీనటులు : రక్షిత్, నక్షత్ర, రఘుకుంచె, తిరువూర్, లక్ష్మణ్ మీసాలా తదితరులు
దర్శకత్వం : కరుణ కుమార్
నిర్మాత : ధయాన్ అట్లూరి
బ్యానర్ : సుధాస్ మీడియా
మ్యూజిక్ : రఘుకుంచె
సినిమాటోగ్రఫి : అరుల్ విన్సెంట్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర్రావు
రిలీజ్ డేట్ : 2020-03-06
రేటింగ్ : 2/5
సామాజిక సమస్యలు, 1980 నాటి పరిస్థితులు ఇలా ఊహించుకున్నప్పుడు ఎంతో బాగుంటుంది. వాటిని తెరపై అందంగా చూపిస్తే కాసుల పంట పండించవచ్చు. రంగస్థలం అలాంటి కోవకు చెందిందే. ఆ సినిమా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. మరో రంగస్థలంలా ప్రేక్షకులను మెప్పించేందుకు పలాస 1978 చిత్రం నేడు (మార్చి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.
కథ
ఈ కథ పలాస ప్రాంతానికి చెందినది. 1970-80ల కాలంలో నాటి పరిస్థితులు, అక్కడి సామాజిక సమస్యలను చూపుతూ సాగుతుంది. ఆ ఊర్లో పెద్ద షావుకారి లింగమూర్తి (జనార్ధన్ రావు), చిన్న షావుకారి గురుమూర్తి (రఘు కుంచె) మధ్య ఆదిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. వీరి మధ్యలో మోహన్ రావు (రక్షిత్), రంగారావు (తిరువూర్) కథ ఏంటి. నిమ్న కులాలకు చెందిన వీరిద్దరికి, అగ్ర కులాలకు చెందిన లింగమూర్తికి, గురు మూర్తికి మధ్య జరిగిన సంఘటనలేంటి? చివరకు వీరంతా ఏమయ్యారు? ఈ కథలో లక్ష్మీ (నక్షత్ర), బైరాగి (ఉమా మహేశ్వర రావు), గణపవాసు (షణ్ముకేష్), తారకేశ్ (ప్రవీణ్ యండమూరి), సెబాస్టియన్ (విజయరామ్), ధన్‌దాస్ (లక్ష్మణ్ మీసాలా) పాత్రలు చేసిందేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానమే పలాస.
నటీనటులు..
పలాస చిత్రంలో ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉంది. కనిపించినంత సేపు ప్రతీ క్యారెక్టర్ ప్రేక్షకుడిపై ప్రభావాన్ని చూపేలా ఉంటుంది. అయితే సినిమా ఆసాంతం కనిపించేది.. మాత్రం మోహన్ రావు(రక్షిత్). ఎమోషన్ డైలాగ్స్ చెప్పడంలో కొన్ని సీన్స్‌లో తడబట్టు అనిపించినా ఓవరాల్‌గా మెప్పించాడు. హీరోయిన్‌గా నక్షత్ర లక్ష్మీ పాత్రలో తెరపై అందంగా కనిపిస్తూ.. నటనతోనూ మెప్పిస్తుంది. మోహన్ రావు అన్నగా రంగారావు పాత్రలో తిరువూర్, అతని స్నేహితుడిగా ధన్‌దాస్ క్యారెక్టర్ లక్ష్మణ్ మీసాలా బాగా నటించారు. ఈ సినిమాకు ముఖ్య పాత్రలుగా చెప్పుకోదగ్గవి లింగమూర్తి (జనార్ధన్ రావు), గురుమూర్తి (రఘు కుంచె). వీరిద్దరు నెగెటివ్ రోల్‌కు చక్కగా సరిపోయారు. పోలీసాఫీసర్‌గా సెబాస్టియన్ పాత్రలో విజయరామ్, తండ్రి చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకునే కొడుకు క్యారెక్టర్‌లో తారకేశ్ (ప్రవీణ్ యండమూరి) పర్వాలేదనిపించారు. మిగతా పాత్రలో అందరూ తమ పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ
సామాజిక సమస్యలు, అగ్ర కులాలు, నిమ్న కులాలు, వర్గ పోరాటం, ఇలాంటి కాన్సెప్ట్‌ల ఆధారంగా ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. అయితే అందులో అన్ని సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి. ఇలాంటి సామాజిక సమస్యలు సినిమాగా తెరకెక్కించేటప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. మొత్తం సీరియస్ మోడ్‌లో చెప్పాలా? వినోదాత్మకంగా చెప్పాలా? వాటిని మెయిన్ పాయింట్స్‌లా చెప్పాలా? లేదా పరోక్షంగా చెప్పాలా? అనే ప్రశ్నలు మొదలవుతాయి.
రంగస్థలం, అసురన్ చిత్రాలు కూడా ఇలాంటి కోవకే చెందినవి. అయితే రంగస్థలం చిత్రం కూాడా అగ్ర వర్ణాల ఆధిపత్యాన్ని చూపిస్తూనే తెరకెక్కింది. అయితే వాటినే మెయిన్ పాయింట్‌లా తీసుకోలేదు. అసురన్ చిత్రంలోనూ అంతే. పరోక్షంగా సామాజిక సమస్యలను వేలెత్తి చూపిస్తుంది. పలాస చిత్రం కూడా అలాంటి కథతోనే వచ్చింది. అయితే తెరకెక్కించిన విధానంలోనే ఎంతో తేడా ఉంది. రెండున్నర గంటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడినట్టు కనిపిస్తోంది.
కథలో ముగింపు ఏవిధంగా ఉంటుందో అందరూ ఊహించేదే. అయితే క్లైమాక్స్‌లో హీరో చేత చెప్పించిన కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ సినిమాలో అన్నింటి కంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్ గురించే. కడుపు నిండిపోయిన కథ.. కడుపు మండిపోయిన కథ, వినాయకుడి తలను అతికించిన దేవుడు.. ఏక లవ్యుడిని వేలిని అతికించడానికి రాలేదు, వంటి కొన్ని మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
అయితే పూర్తి చిత్రంగా చూసినప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు. ఈ సినిమాలో రఘుకుంచె అందించిన సంగీతం ఏమంతగా ఉపయోగపడలేదనిపిస్తుంది. అరుల్ విన్సెంట్ తన కెమెరాతో అప్పటి వాతావరణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. కోటగిరి వెంకటేశ్వర్రావు ఇంకొన్ని సీన్లకు కత్తెర పెడితే బాగుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్
నటీనటులు
కథ
మైనస్ పాయింట్స్
స్లో నెరేషన్
కమర్షియల్ అంశాలు లేకపోవడం
చివరగా.. పలాస జీడిపప్పు ఫేమస్సే, కానీ ఈ ‘పలాస’ కాదు!