అన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తమ్ముడు, ఏపీడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా విషేష్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే పవన్ చేసిన ట్వీట్ కు తాజాగా చిరంజీవి రిప్లై ఇచ్చారు. జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు.. తమ్ముడు కల్యాణ్… “ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా.
నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది. ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.