బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో అనురాగ్ కశ్యప్ ఆఫీస్ కి వెళితే తనతో ఆసభ్యంగా ప్రవర్తించాడని, అత్యాచారం చేశాడని పాయల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించింది.
జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ పాయల్ ట్వీట్‌కి స్పందించి సరైన ఆధారాలతో కేసు ఫైల్ చేయమని అప్పుడు తాము చూసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ముంబై పోలీసుల్ని సంప్రదించిన పాయల్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై కేసు పెట్టింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు అనురాగ్ తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. పోలీసుల ముందు హాజరైన అనురాగ్ ఆ సమయంలో తాను శ్రీలంకలో వున్నానని, లాంటప్పుడు తాను ఎలా పాయల్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తానని వెల్లడించాడు.
దీనిపై పాయల్ ఘాటుగా స్పందించింది. కశ్యప్ పోలీసుల ముందు అబద్ధం చెప్పారని, నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ అండ్ పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం నా లాయర్ దరఖాస్తు చేస్తున్నారని ఆ తరువాత పోలీసులే అనురాగ్ నుంచి నిజమేంటో రాబడతారని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ట్యాగ్ చేస్తూ సంచలన ట్వీట్ చేసింది. దీంతో అనురాగ్‌కు లై డిటెక్టర్ టెస్టులు తప్పవనే వాదన వినిపిస్తోంది.