ఎడిట్ నోట్ : ఊరుకో హృద‌య‌మా.. సింగ‌ర్ కేకేకు నివాళి

-

ఎడిట్ నోట్ : ఊరుకో హృద‌య‌మా.. సింగ‌ర్ కేకేకు నివాళి
అర్థం కాని పుస్త‌కం అని ఎందుకు అన్నారు క‌వీ ప్రేమ‌ను.. ప్రేమ అయినా, జీవితం అయినా కొన్ని అనంతార్థాల కూడిక క‌దా ! ఇప్పుడు ఈ చీక‌టి ఆ వెలుగు కూడా అనంతార్థాల కూడికే క‌దా ! మీరు అర్థం చేసుకోవాలి. జీవితానికి విషాదం తోడుండి మ‌రో వికాసం ద‌గ్గ‌ర ప‌రి స‌మాప్తి అవుతుంది అని! ఈ వెలుగు అయినా కొద్దిపాటి జ్ఞాన సంకేతిక అయితే మేలు. ఈ ఉద‌యం
ఆ గాయ‌కుడికి నివాళి రాస్తూ రాస్తూ మ‌రో కొత్త వెలుగు ఇంటి వాకిట ప‌రుచుకుంటోంది అని గుర్తించాలి మీరు. మ‌నిషి వెలుగులు గుర్తించ‌డ‌మే సిస‌లు వికాసం మ‌రియు వివేకం కూడా !

జీవిత ప‌ర‌మార్థం ఎక్క‌డుంది.. నిజాయితీతో కూడిన వాక్యార్థంలో ఉంది. క‌న్నీటి జ‌ల‌పాతాల స‌వ్వ‌ళ్లులో ఉంది. ఆగిపోయిన గుండెలు కొన్ని,అల‌సిసొల‌సిన క‌న్నులు కొన్ని..జీవితం ఆగిపోయిన  చోట వెతుకులాట..అల‌సిసొల‌సిన చోట ఏం పొందామో అన్న ఓ చిన్న ఆరాటం. మిగిలిన కాలంలో ఆ కుర్రాడు.. మిగిలిన లోకంలో మ‌నం.. మ‌నుషులే వీళ్లంతా.. త‌ప్పుల నుంచి ఒప్పుల వ‌ర‌కూ ! నిస్వార్థ నిశీధిని ప్రేమిస్తే అకాల మ‌ర‌ణ వాంఛ‌ల్లో మ‌నం మ‌రింత‌గా నేర్చుకోద‌గ్గ‌దేదో ఉండే ఉంటుంది..ఇవి క‌ల‌వ‌ని జంట‌లు..క‌ల‌వ‌ని మ‌నసులు కూడా ! క‌వీ నీవు చెప్పి వెళ్లావు..ఓ గాయ‌కుడా ! మ‌రో మాధుర్య ప్ర‌ధానం అయిన జీవితాన్నీ వ‌సంతాన్నీ విషాదం లేకుండా అందించి వెళ్లు.. ఇప్పుడున్న కాలాల్లో ఉన్న విషాదాల‌కు విరుగుడు ఉంటే చెప్పి వెళ్లు.. మీకివే నివాళులు కేకే.
https://www.youtube.com/watch?v=R1rQhTPSMy8

ఇప్ప‌టిక‌న్నా మంచి సంద‌ర్భాలేవో మ‌న జీవితాల‌ను ప‌ల‌క‌రించాలి..ఇప్ప‌టి క‌న్నా మంచి స్వ‌రాలేవో నివాళి రూపానికి అంకితం అయి ఉండాలి..లేదా ఆ ఆత్మ సంచార రూపానికి చేరుకుని ఉండాలి. కోల్ క‌తా వీధుల్లో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సింగ‌ర్ కేకే (పూర్తి పేరు : కృష్ణ‌కుమార్ కున్నాత్, వ‌య‌సు : 53) అంతిమ ప్ర‌యాణంలో తాను ఎంచుకున్న‌వి, తాను ప్రేమించి పంచుకున్న‌వి అన్నీ వెంటే వస్తే ఎంత బాగుంటుంది. ఊరుకో హృద‌యమా.. ఊరుకో..
https://www.youtube.com/watch?v=y5r5JL064Us

ఎవ్వ‌రినెప్పుడు త‌న వ‌లలో బంధిస్తుందో ఈ ప్రేమ.. వింటూ వింటూ ఎన్ని సార్లు ఏడ్చారు మీరు. ఎన్ని సార్లు బాధ ప‌డి ఉంటారు మీరు. జీవితం కూడా అర్థం కాని పుస్త‌క‌మే అని నిర్వ‌చించి వెళ్లిపోయిన క‌వికి, జీవితం కూడా అర్థం లేని ముగింపే అని చెప్పి వెళ్లిన ఈ గాయ‌కుడికి ఈ ఉద‌యం నివాళి రాయ‌డం అంటే గుండెకు బ‌రువు. మ‌నుషులే స‌ర్ .. వీళ్లంతా.. మీలో క‌రిగి నాలో క‌రిగి పెద్ద,పెద్ద  బాధ‌ల్లో చిన్న,చిన్న ఆశలు నింపి వెళ్ల‌డం వీరి బాధ్య‌త. సంగీత ప్ర‌పంచంలో మ‌రో ప్రక‌ట‌న చేయాలంటే మ‌రో మంచి సంద‌ర్భాలేవో వెత‌కాలి.

https://www.youtube.com/watch?v=taFjPLv-tSI

హ‌ద్దులు లేని ప్ర‌పంచంలో సంగీతం అనే ఓ పెద్ద స‌ముద్రాన్ని ఎన్నో సార్లు ద‌గ్గ‌ర‌గా చూడ‌డం మ‌న‌కు తెలుసు. బిందువుల రూపంలో మ‌నిషి అక్క‌డికి చేరుకుంటాడు. చిందులేస్తూ లేస్తూ.. ప‌డి లేస్తూ లేస్తూ ఓడిపోతాడు. ఓడిపోయిన మ‌నిషి చెప్పిన గాయాల క‌థ ఇది. కావొచ్చు. జీవితం ఇక్క‌డితో ముగింపు అని చెప్పి పోవ‌డంలోనే అర్థం లేదు. మ‌నిషి ముగింపు అనే ప‌దాన్ని మ‌రోసారి  అన్య‌మ‌న‌స్కంగా ప్ర‌క‌టించి వెళ్లాడు. అన్యం అయిన‌వేవో అర్థం కూడుకుని ఉన్నాయి. అన్యం అయిన‌వేవీ  వ‌ద్ద‌నుకునేంత‌గా లేవు. మ‌ర‌ణం ఇప్పుడు అన్యం అయి ఉంది. ఇత‌రులకు సంబంధించిన మ‌ర‌ణాల‌ను మ‌నం చూసి విని నిర్వేదాల చెంత ఉండిపోవ‌డం త‌రుచూ చేస్తున్న ప‌ని. మ‌ణి శ‌ర్మ, ఆర్పీ, కీర‌వాణి లాంటి కొంద‌రు సంగీత దర్శ‌కుల ద‌గ్గ‌ర ఆయ‌న మంచి పాట‌లు పాడారు. గుర్తుకొస్తున్నాయి అంటూ నా ఆటోగ్రాఫ్ ఇదే అని చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు న‌వ్వుల కోలాటాలు లేవు. ఆయ‌న మ‌న‌కు అన‌గా తెలుగు వారికి చేరువ‌. ద‌క్షిణాదికి చేరువ. భార‌తీయ సినీ సంగీతానికీ చేరువ. పాట‌కు ప్రాణం ప‌ల్ల‌వి అయితే .. ప్రేమ‌కు ప్రాణం ప్రేయసి కాదా అంటూ వెస్ట్ర‌న్ మాయా జాలం చేసిన స్వ‌రం మ‌ళ్లీ వస్తే బాగుంటుంది. అందాక నిన్న‌టి పాట‌ను ఊర‌డింపుగా చేసుకోవ‌డం ఓ బాధ్య‌త.

 

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Latest news