చిరంజీవికి హీరోయిన్నే కాదు.. చెల్లిని వెతకడమూ కష్టమేనా

చిరంజీవికి హీరోయిన్‌ వెతకాలంటే… దర్శకుడు కిందామీదా పడాల్సిందే. ఆయనకు అంత ఈజీగా జోడీ దొరకదు. ఖైదీనంబర్‌ 150..ఆచార్య షూటింగ్‌ మొదలైన తర్వాతే.. హీరోయిన్స్‌ను సెలెక్ట్ చేశారు. మెగాస్టార్‌కు జోడీనే కాదు.. చెల్లిని వెతకడం కూడా కష్టమే. ఏడాది నుంచి చెల్లి కోసం గాలిస్తూనే వున్నారు. ఆచార్య తర్వాత చిరంజీవి లూసిఫర్‌ రీమేక్‌లో నటిస్తాడు. సుజిత్‌తో మొదలైన డైరెక్షన్‌ వినాయక్‌ చేతుల మీదుగా..చివరికి మోహన్‌ రాజా దగ్గరకు చేరింది. దర్శకులే కాదు.. చిరంజీవి సిస్టర్ కూడా మారుతున్నారు.

ముందుగా… సాయిపల్లవి పేరు వినిపించగా… కీర్తిసురేష్‌ ఫైనల్‌ అయిందన్న వార్త బైటకొచ్చింది. ఇప్పుడీ ప్లేస్‌లోకి ప్రియమణి వచ్చింది. ప్రియమణి చిరంజీవితో ఇంతవరకు జోడీ కట్టలేదు. దీంతో… చెల్లి పాత్రకు తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు మోహన్‌ రాజా భావిస్తున్నాడట. పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ వున్న రోల్‌ కావడంతో.. జాతీయ ఉత్తమనటి ప్రియమణి అయితే బెటర్‌ అన్న ఫీలింగ్‌లో డైరెక్టర్‌ వున్నాడు.

పెళ్లి తర్వాత చాలామంది ఫేడౌఐట్ అవుతారు. కానీ.. 2017లో పెళ్లి చేసుకున్న ప్రియమణి… సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్రేజీ ఆఫర్స్‌ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు నారప్పలో వెంకటేశ్‌తో..విరాటపర్వంలో నక్సలైట్‌గా నటిస్తోంది. 17 ఏళ్ల క్రితం ఎవరే అతగాడుతో వెండితెరకు పరిచయమైన ప్రియమణి పెళ్లైన కొత్తలో మూవీతో హిట్ కొట్టింది. ఆతర్వాత వరుస సినిమాలు చేసినా… 2015 నుంచి గ్రాఫ్‌ పడిపోయింది. ఏడాదికి ఒకటీరెండు సినిమాలతో సరిపెట్టుకుని… ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తోంది ప్రియమణి.

తెలుగులో ఫేడౌట్‌ అయిన టైంలో కన్నడలో ఛాన్సులు అందుకున్న ప్రియమణి ప్రస్తుతం హిందీ మూవీ మైదాన్‌లో .. తెలుగు, తమిళం.. కన్నడలో వరుస సినిమాలు చేస్తోంది. వెంకటేశ్‌.. రానా సినిమాల్లో ఇంపార్టెంట్‌ రోల్స్ చేస్తున్న ప్రియమణికి లూసిఫర్‌ రీమేక్‌లో చిరంజీవి చెల్లిగా అవకాశం వచ్చే బంపర్‌ ఆఫర్ దక్కినట్టే. చెల్లి పాత్ర ఇప్పటికే ఇద్దరితో దాగుడుమూతలు ఆడింది. మరి ప్రియమణి అయినా.. చెల్లిగా సెటిల్‌ అవుతుందో లేదో మరి.