ర‌మికా సేన్ పాత్ర‌కు ఇందిర స్ఫూర్తా?

సైలెంట్ గా వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ క‌న్న‌డ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించి ద‌క్షిణాదిలో హాలీవుడ్ స్థాయి చిత్రాలకు ఏమాత్రం తీసిపోని మేక‌ర్స్ వున్నార‌ని `బాహుబ‌లి` త‌రువాత సినీ ప్ర‌పంచానికి మ‌రోసారి చాటి చెప్పిన చిత్ర‌మిది. య‌@్ రాక‌స్టార్‌గా త‌నదైన స్టైల్లో న‌టించి మాస్‌లో తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.

దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెల‌కొన్నాయి. అందుకు ఏమాత్రం త‌గ్గ‌ని స్థాయిలో చాప్ట‌ర్ 2ని స‌ర్వాంగ సుంద‌రంగా మేక‌ర్స్ తీర్చిదిద్దుతున్నారు. న‌టీన‌టుల విష‌యంలోనే జాగ్ర‌త్త‌లు తీసుకున్న ప్ర‌శాంత్ నీల్ అధీరా పాత్ర‌కు బాలీవుడ్ స్టార్ సంజ‌య్‌ద‌త్‌ని ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రో కీల‌క‌మైన పాత్ర కోసం బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్‌ని పైన‌ల్ చేసుకున్నారు. ఇందులో ర‌వీనా టాండ‌న్ ప్ర‌ధాని ర‌మికా సేన్‌గా క‌నిపించ‌బోతోంది. మాజీ ప్ర‌ధాని ఇందిర‌ను పోలివుండే ఈ పాత్ర‌లో ర‌వీనా కొత్త‌గా క‌నిపించ‌బోతోంది. తాజాగా సోమ‌వారం ర‌వీనా పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని చిత్ర బృందం ర‌మీకా సేన్ లుక్‌ని రిలీజ్ చేసింది. మెరున్ క‌ల‌ర్ సారీలో ఇందిర‌ని పోలి వున్న పాత్ర‌లో ర‌వీనా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించ‌బోతోంది.