ట్రిపుల్ ఆర్ పై అల్లూరి మేనల్లుడు ఫైర్… చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ ఆగ్రహం

-

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ ఆర్ఆర్ఆర్’. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ. 336 కోట్ల వ్యయంతో అత్యంత  ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళం, మళయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా… జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీంగా, అలియా భట్ రామ్ చరణ్ ప్రేయసిగా సీత పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్ తో పాటు సముద్ర ఖని, శ్రీయ వంటి వారు ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే అల్లూరి, కొమురం భీం స్నేహితులైతే ఎలా ఉండేది అనే ఓ కల్పిత కథతో సినిమాను తెరకెక్కించాడు రాజమౌళి. అయితే సరిగ్గా ఇక్కడే వివాదాలు మొదలయ్యాయి.

ట్రిపుల్ ఆర్ ప్రారంభం నుంచి వివాాదాలు వెన్నాడుతున్నాయి. అల్లూరి, కొమురంభీంల చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం చరిత్రను వక్రీకరించారంటూ అల్లూరి సౌమ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే ఇది కేవలం కల్పిత కథే అని.. ఇందులో అల్లూరి, కొమురం భీంలను దేశభక్తులుగా చూపామని చిత్రయూనిట్ కోర్ట్ కు విన్నవించింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ నిలిపేయాలన్న పిల్‌ను కొట్టివేసింది. మరోవైపు.. సినిమాతో అల్లూరి, కొమ్రంభీం పేరు, ప్రతిష్టలకు ఎలాంటి భంగం క‌ల‌గ‌ద‌ని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది హైకోర్టు.

ఈ వివాదంపై తాజాగా అల్లూరి మేనల్లుడు గొట్టి ముక్కల వెంకట సత్యనారాయణ ఫైర్ అయ్యాడు. సినిమాలో అల్లూరి, కొమురం భీం పేర్లను తొలగించి సినిమా రిలీజ్ చేయాలని డిమాండ్లు చేశారు. గాంధీ ఆయుధాలు పట్టి బ్రిటీస్ వాళ్లతో పోరాటం చేశారని.. నేతాజీతో కలిసి ఉద్యామాలు చేశారని సినిమా తీయగలరా..? అని ప్రశ్నించారు. డబ్బుకోసం చరిత్ర వక్రీకరిస్తారా.. అంటూ ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం ఉంటుందని గొట్టిముక్కల స్పష్టం చేశారు.

నిజానికి అల్లూరి 1897లో విశాఖ పట్నం పాండ్రంకిలో పుట్టగా.. కొయ్యూరు మండలం రాజేంద్ర పాలెంలో 1924 మే 7న బ్రిటిష్ వాళ్ల కాల్పుల్లో వీరమరణం పొందారు. కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోంది. అయితే చరిత్రలో వీరిద్దరు కలిసినట్టుగా… స్నేహంగా ఉన్నట్లుగా ఎక్కడా లేదు. అసలు చరిత్రలో లేని విషయాన్ని ఎలా చూపిస్తారంటూ పలువురు విమర్శిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news