మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర షూటింగ్‌కు ఇటీవలే బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మించిన సెట్‌లో జరుగుతోంది. అయితే సదరు సెట్ నిర్మించిన స్థలం ప్రభుత్వ స్థలం కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండానే చిత్రం కోసం అక్కడ సెట్స్ వేయడంపై స్థానిక రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు సెట్స్‌ను కూల్చి వేశారు.
నిజానికి ఆ సెట్ రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమా కోసం వేసింది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే అదే సెట్‌లో సైరా సినిమా షూటింగ్ చేస్తుండడంతో రెవెన్యూ అధికారులు ఆ సెట్‌ను కూల్చివేశారు. అయితే ఇలాంటి పరిస్థితి ముందుగానే వస్తుందని ఊహించిన చిత్ర నిర్మాత రాంచరణ్ తేజ మరో సెట్‌ను సిద్ధంగానే ఉంచినట్లు తెలిసిందే. సినిమా షూటింగ్ ఇప్పటికే బాగా ఆలస్యం అయింది కనుక ఇలాంటి కారణాల వల్ల షూటింగ్ ఆగిపోకూడదనే ఉద్దేశంతో సదరు కొత్త సెట్‌ను ఆగమేఘాల మీద సిద్ధం చేశారట.
ఇక కొత్తగా సిద్ధం చేసిన ఆ సెట్‌లో మరో రెండు మూడు రోజుల్లో పని పూర్తవుతుందని, అప్పుడు వెంటనే సైరా సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని తెలిసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నాలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.