‘మక్కల్ నీది మయ్యం’ పేరిట రాజకీయ పార్టీని స్థాపించినప్పటి నుంచి నటుడు కమలహాసన్ ఓవైపు బిజీగా సినిమా షూటింగ్‌లు చేస్తూనే మరో వైపు క్రియాశీల రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తమిళనాడులో ప్రజల సమస్యలను తెలుసుకొని అందుకు తగిన విధంగా స్పందిస్తూనే ఉన్నారు. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాను సొంతంగా పోటీ చేస్తాడా, లేక వేరే పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తారా అన్న విషయంలో మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కానీ దీనిపై తాజాగా కొంత స్పష్టత వచ్చినట్లే తెలుస్తోంది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ కూటమిలో చేరేందుకు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ సానుకూల సంకేతాలు ఇచ్చారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలిపారు. తాజాగా చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే డీఎంకే, కాంగ్రెస్ పొత్తు ఖరారు కాగా టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, రాందాసు నేతృత్వంలోని పీఎంకే, తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తిరునావుక్కరసర్ తెలిపారు. ఇక వీరితోపాటు కమల్‌హాసన్ కూడా తమ కూటమి వైపే మొగ్గు చూపుతున్నారని ఆయన చూచాయగా వెల్లడించారు.
దీన్ని బట్టి చూస్తే కమలహాసన్ కాంగ్రెస్ కూటమితో కలిసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై కమల్‌హాసన్, ఆయన పార్టీ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కాగా గతంలో ఓసారి కమలహాసన్ తమిళనాడు అభివృద్ధి చెందాలంటే బీజేపీకి దూరంగా ఉండాలని కూడా వ్యాఖ్యలు చేశారు. మరో వైపు కొద్ది నెలల కిందట జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే పార్టీ వైఫల్యం చెందింది. ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన దినకరన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతోపాటు అన్నాడీఎంకే బీజేపీకి మద్దతు ఇస్తున్న విషయం కూడా తెలిసిందే. కనుక తాను ముందు చెప్పినట్లు బీజేపీతోపాటు దాని మిత్రపక్షాలతో కాకుండా ఇతర పార్టీలతో కూటమిగా ఏర్పడితే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని కమలహాసన్ భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే కాంగ్రెస్ కూటమి వైపు ఆయన చూస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు..!