ఓటీటీవైపు తెలుగు సినిమా అడుగులు.. భారీ సినిమాల సంగతేంటి..?

-

సినిమా చూడాలి అంటే థియేటర్ కి వెళ్ళాలి. థియేటర్ కి ఇప్పుడు వెళ్తామా…? అది సాధ్యం కాదు. ఇప్పట్లో అయ్యే పని కాదు. మరి మనకు వినోదం ఎలా…? ఏదోక పాత సినిమానో చూసిన సినిమానో చూస్తాం. మరి అప్పులు తెచ్చి సినిమాలు తీసిన నిర్మాతలు…? రోడ్డున పడాల్సిందే కదా..? కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమ పైకి చెప్పలేని నరకయాతన అనుభవిస్తోంది అనేది అక్షరాలా నిజ౦.

లాభాల సంగతి పక్కన పెట్టండి… సినిమా నష్టాలు రాకుండా ఉంటే చాలు. ఆస్తులు, భార్యల బంగారం అమ్ముకోకుండా ఉంటే చాలు. అందుకే ఇప్పుడు నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్ ఫా౦పై అడుగులు వేస్తున్నారు. సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం, ఆహా వంటి యాప్స్ లో తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. ఎంతో కొంత వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు మరి…

సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్ళకుండానే మన ఇంట్లో మన హాల్ లో, మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో, మన లాప్ టాప్ లో సినిమా ప్రత్యక్షం అవుతుంది. అది కూడా కొత్త సినిమా… చిన్న చిన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో సినిమాలను విడుదల చేయడానికి ముందుకు వచ్చి ఆయా సంస్థలతో చర్చలు జరుపుతున్నారు నిర్మాత దర్శకులు.

పెద్ద హీరోని అయితే గుర్తు పెట్టుకుంటారు… చిన్న హీరో సినిమా ఆలస్యం అయితే కనుమరుగు అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు చిన్న హీరోలు తమ సినిమాలను ఏదోక రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నారు. నిర్మాతలు కూడా ఇదే ఆలోచనలో ఉండటంతో రిక్వెస్ట్ చేస్తున్నారు. శంకర్, రాజమౌళి, జెమ్స్ కామెరూన్ లాంటి దర్శకుల సినిమాలు అయితే థియేటర్ కి వెళ్లి చూడాలి.

అవి హెవీ బడ్జెట్ కాబట్టి థియేటర్ లోనే విడుదల చెయ్యాల్సి ఉంటుంది. చిన్న సినిమాలకు బడ్జెట్ తక్కువ కాబట్టి పెట్టుబడి వచ్చేస్తుంది.ఇప్పుడు లాక్ డౌన్ లో ఓటీటీ ఫ్లాట్ ఫాం కి మంచి డిమాండ్ ఉంది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓకే… రేపు లాక్ డౌన్ ఎత్తేస్తే కష్టమవుతుంది. ఓటీటీలకు రీచ్ కూడా ఎంత పెరిగినా చిన్న సినిమాలు నష్టాల నుంచి బయటపడవచ్చు. కానీ పెద్ద సినిమాలను కాపాడేంత సీన్‌ లాభాలు ఇచ్చేంత సీన్‌ ఓటీటీలకు లేదనే చెప్పొచ్చు .

ఇలా కాదు, మరో విధంగా ఆలోచిస్తే థియేటర్ ల మనుగడకే ముప్పు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. తమిళంలో సూర్య జ్యోతిక నటించిన ఒక సినిమాను విడుదల చేయ్యాలనుకోగా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. దీనితో చిత్ర నిర్మాత సూర్య అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం చేసుకున్నారు. దీనితో మా పరిస్థితి ఏ౦ కావాలి అంటూ థియేటర్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి.

ఈ సినిమా ఇప్పుడు తమిళనాట వివాదం అయింది. సూర్య ఈ నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే అతని సినిమాలు అన్నీ బాన్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. కాని నిర్మాతల సంఘం మాత్రం అండగా నిలబడింది సూర్యకు… ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పుడు వడ్డీలు పెరుగుతున్నప్పుడు వడ్డీలు కట్టాలా ఏదోక మార్గంలో సినిమా విడుదల చెయ్యాలా అంటూ నిర్మాతలు థియేటర్ యాజమాన్యాలను నిలదీశారు.

మన తెలుగులో కూడా ఇప్పుడు ఓటీటీ హడావుడి మొదలయింది. రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాను ఏప్రిల్ 9 న విడుదల చెయ్యాల్సి ఉంది. కాని అది సాధ్యం కాలేదు. కరోనా కారణంగా సినిమా ఆగిపోవడంతో ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పై విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు. కాని అది నిజం కాదని రెండు మూడు నెలలు ఆలస్యం అయినా సరే సినిమాను థియేటర్ లోనే విడుదల చేస్తామని రామ్ చెప్పాడు.

భాగమతి సినిమా తర్వాత సీనియర్ హీరోయిన్ అనుష్క నటించిన సినిమా నిశ్శబ్దం కూడా ఏప్రిల్ 2 న విడుదల కావాల్సి ఉంది. ఇది కూడా లాక్ డౌన్ తో ఆగిపోయింది. ఈ సినిమాను కూడా ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరగడం తో చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది. అది అంతా తప్పు అని థియేటర్ లోనే విడుదల చేస్తామని స్పష్టత ఇవ్వడంతో కథ సుఖాంతం అయింది.

దీని వలన థియేటర్ కి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అనేది చాలా మంది మాట. టీవీ లు వచ్చిన కొత్తలో ఇక థియేటర్ తో జనాలకు అవసరం లేదని అన్నా సినిమాలను థియేటర్ లోనే చూస్తున్నారు జనాలు. ఏదో చిన్నా చితకా సినిమాలు అయితే వర్కౌట్ అవుతాయి గాని ఇది అంతగా పెద్ద సినిమాలకు వర్కౌట్ కాదని కచ్చితంగా థియేటర్ కి వచ్చి ప్రేక్షకులు చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news