టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారుండరు. ఆయన నటన, డైలాగ్ డెలివరీకి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఫ్యాన్సే. ఆయన సినిమా అంటే థియేటర్లు హౌస్ఫుల్ కావాల్సిందే. బాలయ్య సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే ధీమా ప్రేక్షకుల్లో ఉంటుంది. అలా ఇప్పటికే దాదాపు 100కుపైగా సినిమాలు చేసిన ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఈ ఏడాదితో 50 ఏళ్ల పూర్తవుతుంది.
బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి 2024 ఆగస్టు 30తో 50ఏళ్లవుతుంది. ఆయన నటించిన తొలి సినిమా ‘తాతమ్మ కల’ 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఆయన తండ్రి, స్వర్గీయ ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో బాలయ్య సినీ ప్రయాణంలో కళారంగానికి చేసిన కృషి, సేవలకుగాను తెలుగు ఇండస్ట్రీ ఆయన్ను ఈ ఏడాది సెప్టెంబరు 1వ తేదీన ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. ఈ మేరకు సన్మాన వేడుకకు అంగీకారం తెలపాల్సిందిగా ఇండస్ట్రీ మెంబర్లు తాజాగా బాలకృష్ణను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి బాలయ్య అంగీకరించారు. 50ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో బాలయ్య హీరోగా 108 సినిమాలు చేశారు.