పెద్ద హీరోల సినిమాల్లో తగ్గుతున్న కమెడియన్ల పాత్రలు..

-

ఒకప్పుడు సినిమా అంటే హీరో, విలన్, హీరోయిన్, కమెడియన్, సైడ్ ఆర్టిస్టులు.. ఇలా అందరికీ సమాన పాత్రలు ఉండేవి. ఎవరు చేసే పని ఆ పాత్రలు చేసేవి. అందుకే అప్పట్లో కమెడియన్లకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లు. బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ, సునీల్, బాబు మోహన్, వేణు మాధవ్, సుబ్రహ్మణ్యం, అలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద లిస్టే తయారవుతుంది. మరి ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కమెడియన్ల పాత్రలు.. ఇప్పుడు ఎందుకు పెద్దగా కనిపించట్లేదనేది ప్రశ్న.


ఒకప్పుడు పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా అందరు హీరోల సినిమాల్లో కమెడియన్ల జోరు కనిపించేది. కానీ కొద్ది కాలంగా వీరికి పెద్దగా ఇంపార్టెన్స్ లేని సినిమాలే వస్తున్నాయి. కథను బలంగా మార్చుకుని హీరోను మాత్రమే ఫోకస్ చేసేలా సినిమాలు వస్తున్నాయి. ఇక ఏదైనా కామెడీ సీన్ ఉంటే కూడా ఎక్కువగా హీరోతోనే చేయించేందుకు డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ కథే బలంగా కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది రాను రాను కామెడీ స్కోప్ తగ్గేందుకు కారణం అయింది. మొన్నటికి మొన్న వచ్చిన రంగస్థలం, అలా వైకుంఠపురం, సైరా, అరవింద సమేత, ఉప్పెన, క్రాక్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద హీరోల చాలా సినిమాల్లో కమెడియన్ల పాత్రలు పెద్దగా లేవు. దీంతో అసలు రానురాను కమెడియన్ల కోసం పాత్రలు పుడుతాయా.. లేకుంటే కమెడియన్ల కోసమే ప్రత్యేకంగా సినిమాలు తీయాలా అనే సందేహం వస్తోంది.
జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో ముఖ్యంగా కామెడీ బాగా పేలింది. సీరియస్ కథ కాకున్నా.. బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసింది. అంటే కామెడీకి ఎనలేని ఆదరణ ఉందనేది వాస్తవం. మరి ఈ విషయాన్ని మన సినిమా పెద్దలు పెద్ద హీరోల విషయంలో ఎందుకు పక్కన పెడుతున్నారనేది సమాధానం లేని ప్రశ్న. ఇప్పటికైనా కమెడియన్లకు ప్రాముఖ్యత ఇచ్చే సినిమాలు వస్తేనే ఇండస్ట్రీకి మంచిదని కమెడియన్లు, వారి అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news