బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి జీవితంలో ఎన్నో మలుపులు…..!!

-

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు గారు కాసేపటి క్రితం చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హఠాత్తుగా మృతి చెందారు. కొన్నాళ్లుగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గొల్లపూడి గారు, నేడు  హఠాత్తుగా మనల్ని అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధాకరం అని పలువురు సినిమా రంగ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక తన జీవితంలో ఎన్నో రకాల వృత్తులతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా వ్యవహరించిన గొల్లపూడి గారి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో 1939లో జన్మించిన గొల్లపూడి గారు, చిన్నప్పటి నుండి ఎంతో చలాకీగా ఉండేవారట. తన 14వ ఏటనే పలు కథలు రచించిన గొల్లపూడి గారు మొదట్లో ఒక ప్రముఖ పత్రికకు సంపాదకుడుగా పని చేసారు.

ఆ తరువాత ఆల్ ఇండియా రేడియోలో కూడా పని చేసిన గొల్లపూడి గారికి కెరీర్ పరంగా మరింతగా ముందుకు సాగాలనే ఆపేక్షతో అప్పటి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కాగా సినిమాల్లోకి వచ్చాక 1964లో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా దుక్కిపాటి మధుసూధనా రావు తెరకెక్కించిన డాక్టర్ చక్రవర్తి సినిమాకు గొల్లపూడి అందించిన డైలాగ్స్ కు అప్పట్లో ఎంతో పేరొచ్చింది. సుప్రసిద్ధ టాలీవుడ్ దిగ్గజ దర్శకులు కె విశ్వనాధ్ గారి తొలిసినిమా అయిన ఆత్మగౌరవం కు కథను అందించిన గొల్లపూడి గారు, అప్పట్లో ఆ సినిమాకు ఉత్తమ కథా రచయితగా కూడా అవార్డును అందుకోవడం జరిగింది. ఇక సినిమాలకు కథ, మాటలు రాస్తున్న క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మరియు మాధవిల కలయికలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా కూడా మారారు. అక్కడి నుండి ఎన్నో చిత్రాల్లో తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరించిన గొల్లపూడి గారు మొత్తం 250 సినిమాల్లో నటించడం జరిగింది.

 

1983లో తరంగిణి సినిమాలో ఆయన నటనకు గాను తొలిసారి నంది అవార్డు లభించింది. నటన, సినిమా కథను రాయడంతో పాటు కొన్ని రకాల చిన్న పిల్లల కథలు కూడా ఆయన రాసే వారు. అంతేకాదు ఆయన రాసిన కొన్ని పుస్తకాలు ప్రస్తుతం కొన్ని యూనివర్సిటీ విద్యార్థుల బోధనలో ఉపయోగిస్తున్నారు. అనంతరం జాతీయ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జ్యూరీ మెంబర్ గా కూడా కొన్నాళ్ళు పని చేసిన గొల్లపూడి గారు, శ్రీకాళహస్తి పైపుల కంపెనీని స్థాపించి, దానికి చైర్మన్ గా కూడా వ్యవహరించారు. మరి ఈ విధంగా తన లైఫ్ లో గొల్లపూడి గారు పలు విధాలైన వృత్తులతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా వ్యవహరించారు గొల్లపూడి…….!!

Read more RELATED
Recommended to you

Latest news