త్రిష ఒక వైపున సీనియర్ హీరోల సరసన హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపున లేడీ ఓరియంటడ్ సినిమాలతో దూసుకుపోతోంది. మధ్యకాలంలో హారర్ చిత్రాలను ఎక్కువగా చేస్తూ వచ్చిన త్రిష, ఓ పొలిటికల్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘పరమపదం విలయాట్టు’ ఆమెకు తొలి పొలిటికల్ థ్రిల్లర్. ఈ చిత్రంలో త్రిష… గాయిత్రి అనే డాక్టర్ పాత్రలో, చెవిటి, మూగ సమస్య గల కూతురుకు తల్లిగా నటిస్తోంది. రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గకుండా ధైర్యంగా తన వైద్య వృత్తిని కొనసాగించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే కాన్సెప్టుతో ఈ చిత్రం సాగుతుంది.
కాగా త్రిష తాజాగా వివాదంలో చిక్కుకుంది. పరమపదం విలయాట్టు సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవలే గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర యూనిట్. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టింది ఈ సీనియర్ హీరోయిన్. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ..నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లింది. రెండు రోజుల్లో సదరు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని లేకుంటే సగం రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నిర్మాతల మండలి. సినిమా ప్రమోషన్లకు నటీనటుల రాకపోవడం వల్ల చిన్న నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎవరైనా ఇంకోసారి ఇటువంటివి రిపీట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది.