Pelli@25 years: పెళ్లి కోసం వడ్డే నవీన్ పాట్లు

వడ్డే నవీన్​.. 1997 నుంచి దాదాపు ఓ ఐదేళ్ల పాటు సినీప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. వడ్డే రమేష్​ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు, స్నేహితులు, నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, బాగున్నారా లాంటి సూపర్​హిట్​ సినిమాలతో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2016లో అటాక్​ చిత్రంతో చివరిసారిగా కనిపించిన ఆయన.. నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలకు పనిచేశారు. అయితే ఈ మధ్య కాలంలో కనిపించడమే మానేశారు.

అయితే కోడిరామకృష్ణ దర్శకత్వంలో నవీన్​ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లి’.. ఆయన కెరీర్​లో బిగ్గెస్ట్​ హిట్​. ఈ మూవీ చూసేందుకు అప్పటి ఫ్యామిలీ ఆడియెన్స్​ థియేటర్స్​కు క్యూ కట్టారు. ఈ సినిమా నేటితో విడుదలై 25ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలుసుకుందాం…

అత్తాకోడళ్ళు తల్లీకూతుళ్ళలాగా మెలిగేవారు తక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు. అలాగే కోడలి భవిష్యత్ కోసం కొడుకునే వీడనాడిన అత్తలు చాలా తక్కువ మందే ఉంటారు. ఆ అంశాన్నే ప్రధానంగా తీసుకుని రూపొందిన చిత్రమే ‘పెళ్లి’.

హీరోగా వడ్డే నవీన్​కు, నాయికగా మహేశ్వరికి, విలన్​గా పృథ్వీరాజ్​కు మంచి పేరు తీసుకొచ్చింది. ‘పెళ్లి’ చిత్రం. శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్.రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా 1997 ఆగస్టు 8న విడుదలై ఘనవిజయం సాధించింది.

ఈ మూవీకి ఓ ఫిల్మ్​ఫేర్​, రెండు నంది అవార్డులు వచ్చాయి. హాలీవుడ్​ చిత్రం స్లీపింగ్​ విత్​ ది ఎనిమీ స్ఫూర్తితే దీన్ని రూపొందించారు. తమిళంలో ‘అవల్​ వరువాలా’, కన్నడలో ‘మదువె’, హిందీలో ‘కోయి మేరే దిల్​ సే పూచే’గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

సినిమా కథ ఏంటంటే.. హీరో నవీన్ బ్యాంక్ మేనేజర్​గా హైదరాబాద్ వస్తారు. ఆయన ఓ బట్టలదుకాణంలో పనిచేసే మహేశ్వరి చూడగానే ప్రేమలో పడతారు. ఆమెను పెళ్ళాడాలని పలు పాట్లు పడతారు. ఆమె ఉన్న ప్రాంతంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమెకు ఈ విషయం చెప్పగా, మహేశ్వరి తనకు పెళ్ళంటేనే ఇష్టం లేదని చెప్తుంది. అయినా నవీన్​.. పట్టు వదలకుండా అక్కడి ప్రాంతంలోని ఇరుగు పొరుగు వారితో కలివిడిగా ఉంటూ ప్రయత్నాలు కొనసాగిస్తుంటాడు. దీంతో వారు కూడా నవీన్​కు సాయం చేస్తుంటారు. అయితే అందరినీ మహేశ్వరి చీదరించుకుంటుంది. ఆమెతో కూడా తన అత్త జానకమ్మ కూడా పెళ్ళి చేసుకోమని చెబుతుంది. అందుకు మహేశ్వరి అంగీకరించదు.

ఇందుకు గతంలో తన భర్త పెట్టిన చిత్రహింసలే కారణం. ఓ సారి ఆమె భర్త పెట్టే బాధలు తట్టుకోలేక బ్రాందీ సీసాతో అతడి తలపై కొడుతుంది. అతడి నుండి దూరంగా వచ్చి, అత్తాకోడలు గుట్టుగా బతుకుతూ ఉంటారు. ఆ తర్వాత ఓ సందర్భంలో నవీన్​ను పెళ్లాడాలని భావిస్తుంది. కానీ ఆ సమయంలో మళ్లీ తన భర్త అడ్డుపడటం.. ఆ క్రమంలో అత్త తన కొడుకుకు విషం ఇచ్చి ఆపై తాను కూడా తాగి కోడలి భవిష్యత్​ను కాపాడుతుంది. చివరకు నవీన్, మహేశ్వరిని ఒకటి చేసి ఆమె కన్నుమూస్తుంది. ‘కోడలిని కన్నకూతురిలా చూసుకొనే ప్రతి అత్తకు మా చిత్రం అంకితం’ అంటూ చివరలో కార్డు పడుతుంది. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం అందుకుని మంచి వసూళ్లను సాధించింది.

మొత్తంగా ఈ చిత్రంలో నవీన్ వడ్డే, మహేశ్వరి, సుజాత, గిరిబాబు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అనంత్, అశోక్ కుమార్, కోవై సరళ, వై.విజయ, జయలలిత, పృథ్వీరాజ్ అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు.

సాంగ్స్​ కూడా సూపర్ హిట్​.. శ్రీనివాస చక్రవర్తి అందించిన కథకు, జి.సత్యమూర్తి మాటలు పలికించారు. ఎస్.ఏ.రాజ్ కుమార్ స్వరకల్పనకు సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఇందులోని ‘ఓ యవ్వన వీణా’, ‘రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి’, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’, ‘అనురాగమే మంత్రంగా’, ‘పైటకొంగు ఎంతోమంచిది’, ‘కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాల’ అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి.