తమిళ ఇళయదళపతి విజయ్ తన స్టయిల్ మ్యానరిజమ్ తో ఆడియెన్స్ ని ఫిదా చేస్తూ కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. కేరళా వరదల సమయంలో కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆయన సేవాగుణానికి ఇదొక మచ్చుతునక. ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం ఆయన ప్రత్యేకత. ఆయనలో బయటకు రాని మరో గొప్ప గుణం ఉందట. ప్రతి ఏడాది కార్మికుల దినోత్సవం మేడే సందర్బంగా ఆటో డ్రైవర్లకు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. ఆటో డ్రైవర్లపై గౌరవంతో ఆయన ఇలా భోజనాలు ఏర్పాటు చేస్తుంటారట. అంతేకాదు వారికి కానుకలు కూడా అందజేస్తారట. ఈ సారి కూడా డ్రైవర్లకు భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ సారి ఓ ప్రత్యేకత ఉంది. ఎన్నికల నేపథ్యంలో మే1న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కుదరలేదు. అందుకే ఆదివారం తమిళనాడుకు చెందిన కొందరు ఆటోవాలాలను పిలిపించి వారికి భోజనాలు పెట్టించారు. అంతేకాదు వారికి కానుకలు కూడా అందజేశారు.
ప్రస్తుతం విజయ్ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆయన స్థానంలో తాను స్థాపించిన మక్కల్ ఇయక్కం ఛారిటీ సంస్థ సెక్రటరీ బస్సీ ఆనంద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయ్ మంచి మనసుకి నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. విజయ్ నిజంగా సూపర్‌స్టార్ అంటూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విజయ్ ఇలా ఆటోడ్రైవర్లకు భోజనాలు ఏర్పాటు చేయడం, వారికి కానుకలు అందించడం వెనుక ఓ కారణం ఉంది. గతంలో ఆయన వెట్టైకరణ్ అనే సినిమాలో ఆటో డ్రైవర్‌గా నటించారు. ఆ టైమ్‌లో వారి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్న విజయ్ అప్పట్నుంచి ఇలా వారికి ప్రతి ఏటా మేడే రోజు కడుపునిండా భోజనాలు పెట్టి కానుకలు అందజేస్తున్నారు.
ఇటీవల సర్కార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే విజయాన్ని అందుకున్న విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ గతంలో విజయ్ కి థెరి, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన విషయం విదితమే. తాజా సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఫుట్‌బాల్ కోచ్‌గా విజయ్ కనిపించనున్నారట. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం తన 64వ సినిమాని మానగరం ఫేమ్ లోకేష్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతోపాటు మోహన్ రాజా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.