రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి 11వ తేదీ వరకు సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్పై విచారణను జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది.
చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం రోజున హైకోర్టు విచారణ జరిపింది. ఉదయం 11.45 నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ నంద రాత్రి 11.30 తరువాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు, ఉన్నం శ్రవణ్ కుమారులు వాదనలు. వినిపిస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపుగా చిత్రాలు నిర్మించి విడుదల చేయడం సరికాదన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు పరిధిలోకి తీసుకున్న కోర్టు వచ్చేనెల 11 వరకు సినిమా విడుదలను నిలుపుదల చేసింది.