అన్నానికి లోటులేకుండా ఉండాలంటే ప్రతి నిత్యం ఈ  శ్లోకాలు చదువుకోండి !

అన్నం.. పరబ్రహ్మస్వరూపం. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అటువంటి అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అనుగ్రహం తప్పనిసరి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతీ నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతోపాటు ఉండే అనేకానేక జీవులకు బలిభుక్కులు సమర్పించి భోజనం చేసినవారికి, అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం. ప్రతీ ఒక్కరూ అన్నం తినేటప్పుడు లేదా ప్రాతఃకాలం దేవుడి పూజ చేసేటప్పుడు ఈ కింది శ్లో్కాలు చదువుకుంటే మరింత విశేషంగా అమ్మ దయ ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు ఆ శ్లోకాలు…

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !

అర్థం- నిత్యమైన ఆనందము యిచ్చేదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘొరమైన పాపములనన్నిటినీ కడిగి వేయుదానవు,
హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము.

రెండో శ్లోకం ఇదే…

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే|
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి !
అర్థం – ఓ అన్నపూర్ణా| ఎల్లప్పుడు పూర్ణముగా ఉండు తల్లి| శంకరుని ప్రాణవల్లభురాలా| పార్వతీ| జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్షపెట్టుము.
ఈ శ్లోకాలను చదువుకుంటే అన్నపూర్ణ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది.

  • కేశవ