నాల్గోరోజు బ్రహ్మోత్సవాల విశేషాలు ఇవే !

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో నాల్గోరోజు మంగళవారం కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలలో స్వామివారికి వాహన సేవలు జరిగాయి. సెప్టెంబర్ 22 మంగళవారం ఉదయం, సాయంత్రం సేవల వివరాలు…

కల్పవృక్ష వాహనం

బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఉదయం ఉభయదేవేరులతో కల్పవృక్ష వాహనంపై స్వామి విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వాటిలో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. కల్పవృక్షం మాత్రం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారు.

సర్వభూపాల వాహనం

నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వమంతటకీ రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణాన యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమాన వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.

– శ్రీ