ఐపీఎల్ 4వ మ్యాచ్‌.. చెన్నైపై రాజ‌స్థాన్ గెలుపు..

షార్జా క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ 4వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 16 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. రాజ‌స్థాన్ విసిరిన 217 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో చెన్నై ముందుగానే త‌డ‌బ‌డింది. అయితే మిడిలార్డ‌ర్ కొంత సేపు పోరాడినా సాధించాల్సిన ప‌రుగులు ఎక్కువ‌గా ఉండ‌డంతో చెన్నై జ‌ట్టు ఓట‌మి పాలైంది. ఈ క్ర‌మంలో విజ‌యం రాజ‌స్థాన్‌ను వ‌రించింది.

rajasthan royals won by 16 runs against chennai super kings in ipl 2020 4th match

మ్యాచ్ లో ముందుగా చెన్నై సూప‌ర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో రాజ‌స్థాన్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగుల స్కోరు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో సంజు శాంస‌న్ (74 ప‌రుగులు, 1 ఫోర్‌, 9 సిక్స‌ర్లు), స్టీవెన్ స్మిత్ (69 ప‌రుగులు, 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)లు రాణించారు. ఇక చెన్నై బౌల‌ర్ల‌లో శామ్ కుర్రాన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా దీప‌క్ చాహ‌ర్‌, లుంగి ఎంగిడి, పీయూష్ చావ్లాలు త‌లా 1 వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన చెన్నై టీం నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్ల‌లో డుప్లెసిస్ (72 ప‌రుగులు, 1 ఫోర్‌, 7 సిక్స‌ర్లు), వాట్స‌న్ (33 ప‌రుగులు, 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు)లు రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో తెవాతియా 3 వికెట్లు తీయ‌గా, ఆర్చ‌ర్‌, గోపాల్‌, కుర్రాన్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.