గణేషుడిని దీనితో పూజిస్తే మీ సకల శుభాలు మీ సొంతం !

-

కలియుగంలో శ్రీఘ్రంగా భక్తులను అనుగ్రహించే దేవుళ్లలో గణేషుడు ప్రథముడు. ఆయన భక్తసులభుడు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా ఫర్వాలేదు. ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు. గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దూర్వార గణపతి అని కూడా పిలుస్తారు. వినాయకునికీ గరికకీ మధ్యన పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం రెండే వాటి గురించి తెలుసుకుందాం…

Ganapathi Special Pooja

తాపాన్ని ఉపశమించేందుకు

పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు. అతను అగ్నిస్వరూపుడు. తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు. ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షసప్రవృత్తికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఓసారి ఏకంగా ఆ స్వర్గలోకాన్నే బూడిదచేసేందుకు బయల్దేరాడు అనలాసురుడు. అనలాసురుని బారి నుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోగా, దేవేంద్రుడు వినాయకుని శరణు కోరాడు. తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తూ గరళాన్ని మింగినట్లుగానే, వినాయకుడు ఆ అనలాసురుని ఓ ఉండలా చేసి మింగేశాడు. కానీ తన ఉదరంలోకి చేరిన అనలాసురుని అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు. ఎన్ని ఔషధిలు వాడినా ఆ తాపం తగ్గలేదు. చివరికి శివుని సలహా మేరకు 21 గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గిందన్నది ఒక కథ.

శివపార్వతుల పాచికలు

శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలు ఆడుతున్నారు. వారి ఆటకు న్యాయనిర్ణేతగా ఎవరుండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ గరికబొమ్మ ఎంతసేపూ శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి, అతడిని కుంటివాడివి కమ్మని శపించింది. తన కుర్రచేష్టలను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆ గరికబొమ్మ వేడుకోగా… వినాయకచవితినాడు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేశుని పూజావిధానాన్ని తెలుసుకుని, ఆచరిస్తే అతని అవిటితనం దూరమవుతుందంటూ శావిమాచనాన్ని ప్రసాదించింది పార్వతీదేవి. అప్పటి నుంచి గరిక గణేశుని పూజలో భాగమయ్యిందంటారు.

గణేశుని పూజలో వాడే పత్రిలో గరికకే అధికప్రాధాన్యం. కొందరైతే ఆయనకు వాడే ఏకవింశతి పత్రాలకు బదులుగా కేవలం గరికనే వాడతారు. తమిళనాట వాడవాడలా కనిపించే గణేశుని ఆలయాలలో, భక్తులు స్వామివారికి గరికనే అర్పిస్తారు. వినాయక చవితి వ్రతకల్పంలో దూర్వారయుగ్మం పూజ ఉంది. అంతేకాదు దాదాపు ప్రతి గణపతి దేవాలయంలో గరికతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గరికనే ప్రసాదంగా కూడా ఇచ్చే దేవాలయాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలిగినా ఇది నిజం. విద్యార్థులు, ఉద్యోగార్థులు గరికతో స్వామిని ఆరాధిస్తే సకల జయాలు, శుభాలు సొంతం అవుతాయని గణపతి ఉపాసకులు పేర్కొంటున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news