హిందూ ధర్మంలో సూర్యుడికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఆయనతోనే మన జీవితం ముడిపడి ఉన్నది. అందుకే ఆ స్వామి ఆరాధన పూర్వం నుంచి మన పూర్వీకులు చేస్తున్నారు. ఆ స్వామి ఆరాధనలో కీలకమైనవి సూర్యనమస్కారాలు. సూర్యుడికి నమస్కార ప్రియుడు అని పేరు. ఆయనకు నమస్కారం పెడితే చాలు అని శాస్త్రవచనం. సూర్యనమస్కారాలు చేస్తే అనేక ప్రయోజనాలు మనకు లభిస్తాయి.
ముఖ్యంగా శారీరక, మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా ఆరోగ్యం లభిస్తుంది. సూర్యనమస్కారాలలో 12 రకాల ఆసనాలు ఉంటాయి. సూర్య నమస్కారాలు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్యనమస్కారాలు. నిజానికి సూర్యనమస్కారాలు బ్రహ్మమూహూర్తంలోనే చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను, ఆదిత్యహృదయం బోధిస్తాడు.
శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువులు. 7 అశ్వాలు 7 కిరణాలు. సుషుమ్నం, హరికేశం, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మానవ శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి.
సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణు రూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.
ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధార భూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ వ్యాదులు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో చెప్పబడింది. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ 12 ఆసనాలు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు లెక్క. వీటిలో 1 నుంచి 5… 8 నుంచి 12 ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. అయితే ఆసనానికో ప్రయోజనం ఉంటుంది.