తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీవేంకటేశ్వర క్షేత్రం విశేషాలు మీకు తెలుసా !

-

జాబాలి మహర్షి కోరిక మేరకు శ్రీహరి వెలిసిన క్షేత్రం. కలియుగం దైవంగా నిత్యపూజోత్సవాలతో భక్తుల కోరికలు తీరుస్తున్న క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన క్షేత్రం. జమలాపుర శ్రీవేంకటేశ్వరస్వామి. స్థలపురాణం జాబాలి మహర్షి దశరధ మహారాజు కొలువులో గురు స్ధానంలో వున్నారు. ఆయనకి శ్రీరాముడంటే అత్యంత ప్రేమ. శ్రీరాముడు భార్య, తమ్ముడితో వనవాసానికి వెళ్ళినప్పుడు జాబాలి మహర్షి రాముడిమీద ప్రేమతో వారిని వెనక్కి తీసుకు రావటానికి చాలా ప్రయత్నించాడు. తండ్రి ఆజ్ఞ పాలించాలనే శ్రీరాముడి దృఢ సంకల్పంతో, చేసేదిలేక వెనుతిరిగిన జాబాలి అయోధ్యకి తిరిగి వెళ్ళక తన శిష్యులతో తీర్ధయాత్రలు సేవిస్తూ, ఈ ప్రాంతానికి వచ్చి సూచీగిరి మీద తపస్సు చేసుకున్నాడని చెబుతారు. సూచీగిరి మీద రెండు గుహలున్నాయి. జాబాలి మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీహరి ఒక గుహలో స్వయంభూ వెంకటేశ్వరస్వామిగా వెలిశాడు. శ్రీహరి వెలిసిన గుహ కనుక అది వైకుంఠ గుహ అయింది. వెంకటేశ్వరస్వామి కలియుగ దేవుడు కదా రాముడికాలంలో ఎక్కడున్నాడు అనుకోకండి. వరాహపురాణం ప్రకారం.. వెంకటేశ్వరస్వామి కృతయుగంలోనే వెలిశాడనీ, శ్రీరామచంద్రుడు నారాయణాచలములోని వెంకటేశ్వరస్వామి దర్శించుకున్నాడని దానిలో ఉంది.

రెండవది కైలాస గుహ

ద్వాపర యుగంలో అర్జనుడు పాశుపతాస్త్రంకోసం ఈ సూచీగిరికి తూర్పున వున్న ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు. ఆ సమయంలో శివుడు అర్జనుని శక్తి సామర్ధ్యాలు పరీక్షించాలని మూకాసురుణ్ణి వరాహ రూపంలో పంపించటం, మూకాసురుడి మీద అర్జనుడూ, శివుడూ వేసిన బాణాలు ఒకేసారి తగలటం, వారిద్దరి మధ్యా జరిగిన వాగ్వివాదం మీకు తెలుసుకదా. అప్పుడు శివుడు అర్జనుణ్ణి మెచ్చుకుని పాశుపతం అనుగ్రహించాడు. బాణాలు తగిలి మూకాసురుడు అదృశ్యుడైన చోటే శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసిన గుహ అంటారు. పార్వతీ పరమేశ్వరులు వున్న ప్రదేశం కైలాస గుహ అని ఒక కధనం. జాబాలి మహర్షి తర్వాత కాలంలో అక్కడ వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామికి అర్చనాదులు లేకుండా కొంతకాలం గడిచింది. కారణం ఆ ప్రాంతమంతా ఆ సమయంలో కీకారణ్యం. అలాంటి ప్రాంతానికి తర్వాత కాలంలో దేశాటనం చేస్తూ ఉప్పల యజ్ఞ నారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు చేరుకున్నాడు. అయన అక్కడ వున్న భారద్వాజ నదిలో స్నానం చేస్తూ, నా వంశం పేరున వెలసిన నదిలో స్నానం చేస్తున్నాను, ఇంక ఈ సంచార జీవనం గడపలేకపోతున్నాను…ఈ ప్రాంతంలో స్ధిరంగా వుండేటట్లు అనుగ్రహించు తండ్రీ అని భగవంతుణ్ణి వేడుకున్నాడు. భగవన్నిర్ణయమేమో, ఆయన ఆ కొండకు దగ్గరలో వున్న పెదగోపవరం అనే ఊళ్ళో నివాసం ఏర్పరుచుకున్నాడు. అప్పటికి ఆయన అవివాహితుడు.

యజ్ఞ నారాయణ శర్మ రోజూ భారద్వాజ నదిలో స్నానం చేసి, సూచీ గిరివై వెలసిన వెంకటేశ్వరస్వామిని అర్చించి వచ్చేవాడు. జాబాలి మహర్షి తర్వాత ఆ కొండపై వెలసిన శ్రీనివాసునికి యజ్ఞనారాయణ శర్మగారే ప్రధమ అర్చకుడు. ఒకసారి స్వామిని అర్చిస్తూ ఆయన సమాధి స్ధితి పొందాడు. ఆ స్ధితిలో ఆయనకు భగవంతుడు కనిపించి ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు. ఆయన మనస్సులో అప్పుడు గోచరించిన కోరిక తనకూ ఒక సంసారం, భార్య, వంశోధ్ధారకుడు కావాలని. స్వామి చిరునవ్వు నవ్వి అంతేనా అని అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు భగవంతుని తను కోరిన అతి మామూలు కోరికకి సిగ్గుపడి ముక్తిని ప్రసాదించమని కోరాడు. భగవంతుడు ముందు సంసారంలో నెగ్గుకు రా .. ఆ తర్వాత … అని అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి పొరుగూరి బ్రాహ్మణుడు యజ్ఞనారాయణ శర్మకి పిలిచి పిల్లనివ్వటం, వారికి నలుగురు కుమారులు కలగటం జరిగాయి. వీరిలో ఒక కుమారుని పేరు లింగయ్య శర్మ. ఈయనకు ఆరవ తరంలో అక్కుభట్టు జన్మించారు. ఈ అక్కుభట్టు మూలంగానే స్వామి దుర్లభమైన సూచీగిరినుంచి ప్రస్తుత నివాస స్ధానానికి వచ్చాడు. అక్కుభట్టు అత్యంత శ్రధ్ధా భక్తులతో తనకి వారసత్వంగా వచ్చిన సూచీగిరి వేంకటేశ్వరుకీ అర్చన చేసేవాడు. ఆ సమయంలో సూచీగిరి మీదకి వెళ్ళటానికి మార్గం సరిగ్గా వుండేదికాదు. త్రోవ అంతా రాళ్ళూ, ముళ్ళతో నిండి వుండేది. అక్కుభట్టుకి వృధ్ధాప్యం వచ్చింది. అయినా మానకుండా రోజూ వెంకటేశ్వరుని పూజించి వచ్చేవాడు.

ఒక రోజు కొండమీదకి స్వామిని అర్చించటానికి వెళ్తున్న అక్కుభట్టు కాలికి మొన తేలిన గులక రాయి గుచ్చుకున్నది. ఆయన బాధ తట్టుకోలేక, “శ్రీనివాసా” అని భగవంతుణ్ణి తలచుకుంటూ కింద పడిపోయాడు. అదృష్టవశాత్తూ భగవంతుని కోసం తీసుకెళ్తున్న నివేదన నేలపాలు కాలేదు. సన్నిధి చేరటానికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అక్కుభట్టుకి అంత దూరం వెళ్ళే శక్తి లేదనిపించింది. ఏమి చెయ్యాలో తోచని ఆయన భగవంతుడు సర్వాంతర్యామి. అలాంటి ఆయనకు తాను నైవేద్యం ఇక్కడనుంచి సమర్పించినా స్వీకరిస్తాడు. ఆయనకి తన పరిస్ధితి తప్పక తెలుస్తుంది. తన అపరాధాన్ని మన్నిస్తాడు అనే నమ్మకంతో పడిన చోటనే స్వామికి మానసిక పూజోపచారాలు చేసి, నైవేద్యం సమర్పించాడు. తన తప్పుని మన్నించమని ప్రార్ధించాడు. తర్వాత ఎలాగోలా ఇల్లు చేరాలని నెమ్మదిగా అడుగులు వేసిన అక్కుభట్టుకి “నేను నీతోనే వస్తున్నా. వెనుతిరిగి చూడకుండా వెళ్ళు” అన్న కంఠంస్వరం వినిపించింది.

సదా స్వామినే ధ్యానించే అక్కుభట్టు అది వెంకటేశ్వరస్వామివారి ఆజ్ఞగా భావించి వస్తూ, ప్రస్తుతం ఆలయం వున్న కొండమీదకి రాగానే బ్రహ్మాండమైన శబ్దము వినిపించింది. దానికి అక్కుభట్టు వెనుతిరిగి చూశాడు. ఆయనకి ఆ గుట్టపై ఒక కాలు మోపి, పక్కనే సాలగ్రామరూపంతో నిరాకారంగా, నామాలతో వెంకటేశ్వరస్వామివారు కనిపించారు. ఆ దర్శనానికి తన జన్మ ధన్యమయినదని భావించి అక్కుభట్టు తాదాత్మ్యంతో అన్నీ మరచి స్వామివారి శిలారూపాన్ని కౌగిలించుకుని తన్మయావస్ధలో అలాగే వుండిపోయాడు. స్వామిని అర్చించి తండ్రి ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి అక్కుభట్టు కుమారుడు ఈశ్వరభట్టు ఆందోళనతో తనవారితో కలసి తండ్రిని వెదుక్కుంటూ బయల్దేరాడు. తన తండ్రిని ఆ అవస్తలో చూసి, ఎండ వేడి తట్టుకోలేక అలా పడివున్నాడనుకుని ఉపచారాలు చేశారు. కళ్ళు తెరిచిన అక్కుభట్టు అక్కడివారిని చూసి “భగవంతుడు కరుణామయుడు” అన్నాడు. అక్కడివారికి అర్ధం కాలేదు. అక్కుభట్టు వారికి జరిగినది వివరించి స్వామి పాదాన్ని, సాలగ్రామాన్ని చూపించాడు. ఆనాటినుంచీ అక్కుభట్టు, వారి సంతతివారు ఆ సాలగ్రామాన్ని, పాదాన్నీ పూజించసాగారు.

అక్కుభట్టు స్మార్తుడు. ఆయనకి శివ, కేశవుల బేధం లేదు. ఇక్కడి పూజలన్నీ స్మార్త పధ్ధతిలో జరుగుతాయి. దర్శన సమయాలు- ఉదయం 7 గం. లనుంచీ 1 గం. దాకా, తిరిగి సాయంత్రం 3 గం.లనుంచీ 7దాకా. వసతి, భోజనం ఆలయం వారు చేసే ఏర్పాట్లు వున్నాయి.

రవాణా సౌకర్యాలు – ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో వున్న జమలాపురం చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. విజయవాడ నుంచి పాసెంజర్ రైలు, హైదరాబాద్ నుంచి వచ్చే కృష్ణా, గోల్కొండ ఎక్స్ ప్రెస్ లు ఎర్రుపాలెం స్టేషన్లో ఆగుతాయి. అక్కడనుంచి జమలాపురం ఆటోల్లో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి దాదాపు 50 కి.మీ. ల దూరంలో వున్న ఈ ఆలయానికి స్వంత వాహనాల్లో కూడా వెళ్ళి రావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news