సృష్టిలో ప్రతీది ముందుకు పోవాలంటే స్థితికారకుడు ప్రధానం అంటారు. అలాంటి స్థితికారకుడు అయిన విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. అభిషేక ప్రియ శివా! అలంకార ప్రియ విష్ణుః అని సూక్తి. దీనిప్రకారం విష్ణుమూర్తికి మంచి అలంకారాలు అంటే ఇష్టమని అర్థం. ఆయన్ను అలంకరించడమే కాదు మనం కూడా శుచి, శుభ్రతతో ఉండాలనేది దానిలోని సారాంశం. ఇక ఆయన్ను దేనితో పూజిస్తే శ్రీఘ ఫలితం ఉంటుందో పరిశీలిస్తే..
ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో ప్రధానమైనది తులసీ. ఆయన్ను తులసీ దళంతో లేదా తులసీ మాలతో అర్చించి, తులసీ కూడిన తీర్థాన్ని తీసుకుంటే చాలా మంచిది. ఇక ప్రతి ఇంట్లో మహిళలు రోజూ క్రమం తప్పకుండా భక్తిశ్రద్ధలతో తులసి కోటను ప్రదక్షణలు చేస్తే దీర్ఘసుమంగళీగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఈ తులసీ దళాలతో విష్ణువును ఆరాధిస్తే సకలసౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం.
”తులసీ దళ లక్షేణ కార్తికే యోర్చయేద్దరిం
పత్రేపత్రే మునిశ్రేష్ఠ మౌక్తికం ఫలమశ్నుతే”
తులసీ దళాలతో విష్ణువును పూజిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తే సకలసంపదలు లభిస్తాయి. ఎవరి గృహంలో నిత్యం తులసీ ఆరాధన, తులసీ సేవనం చేస్తూ ఉంటారో వారింట్లో ఎల్లప్పుడూ సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది.
– కేశవ