పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు తాను ఫుల్ టైమ్ పొలిటీషియన్ గానే ఉంటానని చెప్పిన పవన్, మళ్లీ సినిమాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేసాడు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన ఓడిపోయింది. అంతకుమించి పవన్ తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు పవన్ మళ్లీ వెండితెరపై కనిపించేందుకు తహతహలాడుతున్నాడు అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ అజ్ఞాతవాసి సినిమాకు ముందు కొందరు నిర్మాతల దగ్గర సినిమాలు చేస్తానని అడ్వాన్స్ తీసుకున్న మాట నిజం అయితే ఆ తర్వాత రాజకీయాల్లో మునిగిపోవడంతో అడ్వాన్స్‌ల గురించి ఎవరు పట్టించుకోలేదు.
ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తే తాను ఖచ్చితంగా అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలకు ముందుగా సినిమాలు చేయాలి. ఇదిలా ఉంటే పవన్ రీ ఎంట్రీ బాలీవుడ్‌లో అమితాబ్ హీరోగా తెరకెక్కిన పింక్ సినిమా రీమేక్ గా ఉంటుందని, ఈ సినిమాను బోనికపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తారని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు ఇలా ఉండగానే తాజాగా పవన్ తనకు తెలిసింది సినిమా ఒక్కటే అని, తాను హీరోగా చేయకపోయినా నిర్మాతగా మాత్రం వ్యవహరిస్తున్నారంటూ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే.
తన నటన గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని కూడా పవన్ చెప్పాడు. అదే జరిగితే మరి ఇప్పుడు పవన్ ను నమ్ముకున్న నిర్మాతల పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పవన్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం టెన్షన్ పెడుతోందట. పవన్ కోసం దిల్ రాజు సినిమా రీమేక్ రైట్స్ కొన్నాడు. ఇప్పుడు భారీ బడ్జెట్ పెట్టి పవన్ తో సినిమా తీయాలని తన ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ టైంలో పవన్ నటిస్తానని కచ్చితంగా చెప్పకపోవడంతో పాటు, అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతల పరిస్థితి కూడా గందరగోళంలో పడింది.