లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అందరూ ఆరాటపడుతుంటారు. చాలామంది చేసే చిన్నచిన్న పొరపాట్లతో లక్ష్మీకళతో ఉండాల్సిన కుటుంబాలు, ఇండ్లు వెలవెలబోతాయి. అయితే అసలు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఏంచేయాలో తెలిపే కథ ఒకటి తెలుసుకుందాం…
పురాణాలలో ఉన్న కథ ప్రకారం ఒక రాజ్యంలో ఒక రోజు రాజు, మంత్రి మారువేషంలోరాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి”నీకు ఏం బహుమానం కావాలో కోరుకో” అని అంటాడు. కాని రుద్రసేనుడు ”తమరు ఆపదలో ఉంటే కాపాడానేగాని ఏదో ఆశించి మాత్రం కాదు” అని వీరోచితంగా అంటాడు.
దానికి రాజు సంతోషించి ”నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్న తనని కోరమని”చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటంటే కొద్ది రోజులక్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు ”తల్లి ఒకవిషయం చెబుతాను శ్రద్దగా విను.
లోకమంతా చీకటిగా అది కూడా శ్రుక్రవారం రోజు ఎవరి ఇంట్లోను దీపం లేకుండావుండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ౦ది. అప్పుడు నువ్వామెని అడ్డగించి బయట వెళ్ళితే లోపలికి రాకుడదని షరతు విధించు అప్పుడామె నేను లోపలవుండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది. ఇంకొకామె పట్టు పీతాంబరాలతో ధగధగామెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది అమెని కుడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అమె అప్పుడు బయటి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటు౦ది.
ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావ”ని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకువస్తుంది. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో శుక్రవారంరోజు ఎవరూ దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు.
మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతాశీల ఐశ్వర్యవంతురాలవుతుంది.. కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ వుంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్ధించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ”ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను ”అని వరం ప్రాసాదిస్తుంది.
ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు. అదండి కథ.
ఇక అర్థమైయ్యింది కదా ప్రతి శుక్రవారం ఉదయం, సాయంత్రం ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయండి. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించండి. ఆనందంగా జీవితాన్ని గడపండి.