దేశమంతా అయ్యప్పనామ స్మరణ మారుమ్రోగుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో అయితే అయ్యప్ప భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ఇక జనవరి వచ్చిందంటే అందరి మనస్సు మకరజ్యోతి పైకే వెళ్తుంది. లక్షలాది భక్తులు శబరిమలైలో అయ్యపస్వామి దేవాలయం నుంచి మకరవిలుక్కు దర్శనం చేసుకుంటారు. ఈకార్యక్రమాన్ని టీవీల ద్వారా కోట్లమంది వీక్షిస్తారు.
అయితే 2020 జనవరిలో ఏ తేదీన మకరజ్యోతి దర్శనం అనే విషయాన్ని తెలుసుకుందాం…
మకరు విళక్కు పూజల కోసం సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం స్వామి సన్నిధానం తెరుచుకోనుంది. డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు స్వామివారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తారు. అనంతరం జనవరి 21న పడిపూజ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు. అలాగే, ఈ ఏడాది మకరజ్యోతి జనవరి 15న దర్శనం ఇవ్వనుంది. మకర సంక్రాంత్రి జనవరి 15న కాబట్టి, అదే రోజు మకరజ్యోతి దర్శనం ఇస్తుందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ఆలయ అర్చకులు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. మకరు విలక్కు తర్వాత ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు 20వ తేదీ వరకూ కొనసాగుతాయని పేర్కొంది. జనవరి 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు. గతేడాది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆందోళనలు, నిరసనల కారణంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, ఆదాయానికి గండిపడింది. అయితే, ఈ ఏడాది మాత్రం కేరళ ప్రభుత్వం వెనక్కుతగ్గడంతో సన్నిధానంలో ప్రశాంతత నెలకుంది. 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను అనుమతించబోమని, వారికి ఎలాంటి భద్రత కల్పించలేమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున గతేడాది తీర్పును అమలుచేయబోమని స్పష్టం చేసింది. దీంతో సన్నిధానంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామివారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
అయ్యప్ప భక్తులకు గమనిక !
ట్రావెన్‌కోర్ దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది.శబరిమల అయ్యప్ప ఆలయ గర్భగుడి సమీపానికి మొబైల్ ఫోన్ లు తీసుకెళ్లడం నిషేధిస్తూ దేవస్తానం బోర్డు నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే అయ్యప్ప దేవస్థానంలో మహిళా భక్తులు దర్శనం దర్శనం చేసుకునే విషయంలో వివాదం కొనసాగుతుండగా ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా నిషేధించడం సంచలనంగా మారింది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండే అయ్యప్ప దేవాలయం చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా మొబైల్ ఫోన్ ల నిషేధం పై నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల కొంతమంది భక్తులు స్వామివారి వీడియో ని తీసి సోషల్ మీడియాలో పెట్టడం బాగా వైరల్ అయింది.శబరిమల ఆలయాన్ని ఇటీవల సందర్శించిన దేవస్థానం అంబుడ్స్‌మన్, జస్టిస్ పి.ఆర్ రామన్ ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించిన దేవస్థానంలో మొబైల్ ఫోన్ నిషేధించాలంటూ సూచించారు.
అయితే గత ఏడాది కూడా శబరిమల ఆలయం తో పాటు అనేక ట్రావెన్‌కోర్ దేవస్థానం పరిధిలో ఉన్న దేవాలయాల్లో మొబైల్ ఫోన్లు నిషేధించారు.కానీ ఆ తరువాత అంతగా పట్టించుకోలేదు.ప్రస్తుతం భద్రతా చర్యల్లో భాగంగా మొబైల్ ఫోన్ విషయంలో కఠినంగా ఉండాలని దేవస్థానం బోర్డు భావిస్తోంది. పై విషయాలను దృష్టిలో పెట్టుకుని శబరిమల యాత్రలో ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.
– కేశవ
అయ్యపప, మకరజ్యోతి, ఫొటోలు వాడగలరు