రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్కు అన్ని రూపాల్లోనూ సెగ పెరుగుతుందా ? ఆయనను ఉక్కిరి బిక్కిరి చేసేలా అన్ని రాజకీయ పక్షాలూ వ్యూహాత్మకంగా కదులుతున్నాయా ? దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. మరోపక్క, జేఏసీ రూపంలో ఏర్పడిన వివిధ పక్షాల నాయకులు, మేధావులు కూడా జగన్పై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. ఇక, రేపో మాపో.. రాజధాని మార్పుపై కొందరు హైకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో జగన్ ఏం చేయనున్నారు. ఆయన ఏవిధంగా ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఒకపక్క రాజకీయంగా దుమారం, మరోపక్క రైతుల సెంటిమెంట్ రగడ, ఇంకోపక్క ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ .. వాదన. ఇలా ఒకటి కాదు .. రెండు కాదు.. బహుముఖ కారణాలతో.. బహుముఖ రీతుల్లో జగన్పై రాజధాని బాణాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎలా వీటిని ఎదుర్కొంటారు? అనేది ప్రశ్నగా మారింది. పోనీ.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు జగన్కు సహకరిస్తారా? అనేది కూడా ప్రశ్నగానే ఉంది. ప్రస్తుతం కేంద్రంలోని మోడీకి ఎవరి పార్టీ నుంచి కూడా మద్దతు అక్కరలేదు. పైగా మోడీకి ఇప్పుడు రాజకీయంగా ఏపీ చాలా కీలకంగా ఉంది.
వచ్చే ఎన్నికల నాటికి పార్టీని నిలబెట్టాలనేది కమల నాథుల ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి రాజకీయ దుమారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారే తప్ప చల్లార్చే ప్రయత్నం చేయరు. దీంతో కేంద్రంపై జగన్ ఆశలు లేనట్టేనని భావించాలి. ఇక, మిగిలింది న్యాయ వ్యవస్థ. దాదాపుగా ప్రభుత్వానికి అనుకూలంగా రాజధానిపై తీర్పును ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా ప్రశ్నగానే మిగులుతోంది. వేల కొద్దీ రైతులు, పదుల సంఖ్యలో కార్మికులు, కాంట్రాక్టు సంస్థలు, ఒప్పందాలు, అడ్వాన్సులు.. ఇలా అనేకం ఉన్నాయి. వీటిపై విచారణే కనుక జరిగితే.. తప్పకుండా వీరికి అనుకూలంగానే కోర్టులు తీర్పులు వెలువరించే అవకాశం ఉంటుంది.
పోనీ.. అప్పటికే విశాఖకు తరలించేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమేమో .. కానీ, కోర్టు విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఏదో అండ కనిపిస్తుందని అనుకోవడం కల్లోమాటే. ఇవన్నీ ఇలా ఉంటే.. ప్రజలు కూడా ఈ విషయంలో కీలకంగా మారనున్నారు. అయితే, అభివృద్ధి ని కోరుతున్న ప్రాంతాలు జగన్కు జైకొడుతున్న నేపథ్యంలో వీరి నుంచి పెద్దగా ముప్పులేకపోయినా.. ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకతను తట్టుకోవడం మాత్రం అంతఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏవిధంగా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.